- ఇంటర్ బోర్డుకు ఇచ్చిన ఫైర్ ఎన్‌వోసీలు ఫేక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ సేఫ్టీ అనుమతుల్లో భారీ గోల్‌మాల్ బయటపడింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు తయారు చేసినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 52 ప్రైవేట్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. నకిలీ ఎన్‌వోసీలపై అనుమానం రావడంతో ఇంటర్ బోర్డు వాటిని వెరిఫై చేయాలని హైడ్రాకు పంపింది.
142 ఎన్‌వోసీల్లో 52 ఫేక్
రెండు ఫేజ్‌లలో ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా చెక్ చేసింది. ఫస్ట్ ఫేజ్‌లో 76 ఎన్‌వోసీలను పరిశీలించగా.. 7 ఫేక్ అని తేలింది. సెకండ్ ఫేజ్‌లో 66 ఎన్‌వోసీలు చెక్ చేయగా.. 45 నకిలీవని గుర్తించారు. మొత్తంగా 142 ప్రైవేట్ కాలేజీల ఎన్‌వోసీలను పరిశీలించగా.. 90 మాత్రమే ఒరిజినల్‌గా తేలాయి. మిగతా 52 ఎన్‌వోసీలు ఫోర్జరీ చేసినవిగా గుర్తించారు. ఈ కాలేజీలపై బీఎన్‌ఎస్‌లోని 337, 336(3), 340(2), 318(4), 3(5) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లెటర్ రాసింది. బర్కత్‌పురలోని హైందవి జూనియర్ కాలేజీ ఫేక్ ఫైర్ ఎన్‌వోసీ వాడుతోందని ఫిబ్రవరి 26న ఫిర్యాదు వచ్చింది. హైడ్రా రికార్డులు చెక్ చేయగా.. ఆ కాలేజీ ఇచ్చిన ఎన్‌వోసీ నకిలీదని తేలింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇచ్చిన ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా పరిశీలించింది. ఈ చెక్‌లో 52 ఫేక్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి.
కొనసాగుతున్న విచారణ...
ఫైర్ సేఫ్టీ విషయంలో హైడ్రా చర్యలను కొనసాగిస్తుంది. నకిలీ పత్రాలతో ఇంటర్ బోర్డు అనుమతులు పొందిన వారి వివరాలను బయటకు పెడుతుంది. ఇప్పటికే రెండు విడతల్లో 52 ఫేక్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఫైర్ సేఫ్టీ లేకుండానే ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారుతుందని అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, నకిలీ పత్రాల తయారీకి సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు అంటున్నారు. అసలు ఇటువంటి కాలేజ్ లు ఎన్ని ఉన్నాయనేది త్వరలో గుర్తించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
- ఫస్ట్ ఫేజ్‌లో కేసులు నమోదైన కాలేజీలు..
- హైందవి జూనియర్ కాలేజీ, బర్కత్‌పుర
- రెజోనెన్స్ జూనియర్ కాలేజీ,
- ఎస్‌ఆర్ నగర్
- ప్రియాంక జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్, మెహదీపట్నం
- మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, విద్యానగర్
- శ్రీ చంద్ర జూనియర్ కాలేజీ, చాంద్రాయణగుట్ట
- న్యూ ఎరా జూనియర్ కాలేజీ, చిక్కడపల్లి
- షాహీన్ జూనియర్ కాలేజీ, శివరాంపల్లి
- వశిష్ట జూనియర్ కాలేజీ, తెల్లాపూర్
