- చిన్నారులు ఎదిగేందుకు సమాన అవకాశాలు పొందాలి: నీలిమా ప్రసాద్ దివి
- దివీస్ ఫౌండేషన్, యూనిసెఫ్ ఇండియా మధ్య ఒప్పందం పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: వైకల్యం ఉన్న పిల్లల జీవితాల్లో శాశ్వతమైన మార్పు రావాలంటే బలమైన భాగస్వామ్య సంస్థలతో పాటు సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థలు అవసరమని దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ (డీఎప్జీసీ) మేనేజింగ్ ట్రస్టీ నీలిమా ప్రసాద్ దివి అభిప్రాయపడ్డారు. ప్రతి చిన్నారి వారి పరిస్థితి, లోపాలతో సంబంధం లేకుండా ఎదిగేందుకు సమాన అవకాశాలు పొందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చిన్నారుల సమగ్ర వికాసం కోసం యూనిసెఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న ఒప్పందాన్ని 2026 ఆగస్టు నుంచి 2029 జులై వరకు పొడిగిస్తూ ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ముఖ్యంగా నవజాత శిశువులు, ఎదుగుదల సరిగ్గా లేని చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధిపై ఈ మూడేండ్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వివరించారు.
రెండోదశలో సేవల విస్తరణ...
గత మూడేండ్లలో జరిగిన మొదటి దశలో దాదాపు 20 వేల మంది ఫీల్డ్ వర్కర్లకు, 50 వేల మంది పీడియాట్రిక్ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, 2,200 అంగన్‌వాడీ సెంటర్లలో పోషణ, సంరక్షణ సేవలను మెరుగుపరిచామని డీఎప్జీసీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ గడ్డం వివరించారు. రెండో దశలో భాగంగా జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తామని యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే చెప్పారు. మెదడు అభివృద్ధికి కీలకమైన చిన్న వయసులోనే పిల్లల్లో ఉన్న లోపాలను గుర్తించి, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మెరుగైన ట్రీట్‌మెంట్ అందించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. దేశంలోని ప్రతి చిన్నారి తన పూర్తి సామర్థ్యాన్ని అందుకునే వరకు, వారి కుటుంబాలకు అండగా ఉంటూ దివీస్ ఫౌండేషన్, యూనిసెఫ్ కలిసి కృషి చేస్తాయని వివరించారు.
