చార్మినార్ టూ అసెంబ్లీ వరకు బీజేపీ మహిళా బైక్ ర్యాలీ

చార్మినార్  టూ అసెంబ్లీ వరకు బీజేపీ మహిళా బైక్ ర్యాలీ

సెప్టెంబర్ 17 సందర్భంగా విమోచన ఉత్సవాలను కేంద్ర సర్కార్ ఘనంగా మొదలు పెట్టింది . ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది.  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగనుంది.

17న ముఖ్య నేతలతో షా భేటీ 

విమోచన ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరోజు ముందే హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకోనున్నారు. శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇటీవల చనిపోయిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్​షా పరామర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా ఖరారు కాలేదన్నాయి. ఖరారైతే మాత్రం ప్రభాస్​తో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపాయి. శనివారం పరేడ్ గ్రౌండ్​లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో,  జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు ప్రధాని మోడీ బర్త్ డే కావడంతో పార్టీ ఏర్పాటు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, విమోచన ఉత్సవాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను టీఆర్ఎస్ నేతలు చింపేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.