సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కేసుల పేరుతో అమెరికన్లను బెదిరించి రూ.163 కోట్లు దండుకున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ), ఇంటర్ పోల్ సహకారంతో ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను ఢిల్లీ స్పెషల్ సెల్ కమిషనర్ హెచ్ జీఎస్ ధాలివాల్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు వస్తల్ మెహతా (29) సహా పార్థ్ అర్మార్ కర్(28), దీపక్ అరోరా (45), ప్రశాంత్ కుమార్ (45)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీళ్లను పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించిందని చెప్పారు. ‘‘గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన వస్తల్ మెహతా ఈ ముఠా నాయకుడు. తన కింద కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ఉగాండాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాడు.

వీళ్లంతా కాల్ సెంటర్ల నుంచి అమెరికన్ సిటిజన్స్ కు ఫోన్లు చేసేవారు. యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, డ్రగ్ ఎన్ ఫోర్స్​మెంట్ అడ్మినిస్ట్రేషన్ తదితర అమెరికా సంస్థల ఉద్యోగులుగా చెప్పుకునేవారు. డ్రగ్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో మీ పేర్లు బయటకు వచ్చాయంటూ బాధితులను బెదిరించేవారు. అరెస్టు చేయొద్దంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. అలా వేలాదిమందిని మోసం చేశారు. వాళ్ల నుంచి ఏకంగా రూ.163 కోట్లు వసూలు చేశారు” అని వివరించారు. కాగా, ఈ కేసులు పెరిగిపోవడంతో 2022 డిసెంబర్​లో ఢిల్లీ పోలీసులను ఎఫ్ బీఐ సంప్రదించింది. తమ దగ్గరున్న ఆధారాలను షేర్ చేసింది. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ స్పెషల్ సెల్, ఇంటర్ పోల్, ఎఫ్ బీఐ  కలిసి ఆపరేషన్ చేపట్టాయి.