ప్రజలను కాంగ్రెస్ భయపెడుతోంది: మోదీ

ప్రజలను కాంగ్రెస్ భయపెడుతోంది: మోదీ

ఫూల్ బాణీ/బలాంగీర్/బర్గఢ్: దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ కాంగ్రెస్ లీడర్ మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. ‘‘సొంత దేశాన్నే భయపెట్టాలని కాంగ్రెస్ మరోసారి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉన్నదని, వాళ్లు మనపై దాడి చేస్తారని భయపెడుతున్నది. కానీ పాకిస్తాన్​లో పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఆ అణుబాంబును అమ్మాలని పాకిస్తాన్ చూస్తున్నది. దాన్ని కొనేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఎందుకంటే దాని క్వాలిటీ గురించి అందరికీ తెలుసు” అని అన్నారు. శనివారం ఒడిశాలో మోదీ పర్యటించారు. 

ఫూల్ బాణీ, బలాంగీర్, బర్గఢ్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ధోరణి వల్లనే జమ్మూకాశ్మీర్ ఏండ్లుగా టెర్రరిజంతో సతమతమవుతున్నది. టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పడానికి బదులు.. చర్చలు అంటూ కాంగ్రెస్ కాలం గడిపింది. ఆ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా చేసింది’ అని మండిపడ్డారు. కానీ వాజ్​పేయ్ ప్రభుత్వం శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందని చెప్పారు. ‘‘వాజ్​పేయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా 26 ఏండ్ల కింద ఇదే రోజున పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహించి, ప్రపంచానికి భారత్ సత్తాను చాటింది. భారతీయులు తలెత్తుకునేలా చేసింది” అని చెప్పారు.

రికార్డులు తిరగరాస్తాం.. 

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు కనీసం 50 సీట్లు కూడా రావని మోదీ అన్నారు. ఎన్డీయే కూటమి అన్ని రికార్డులను తిరగరాస్తుందని, 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో రామమందిరం నిర్మించి ప్రజల 500 ఏండ్ల కలను సాకారం చేశాం. అక్కడికి వెళ్లి రాముడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘‘ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేశాం. కానీ ఆమె అయోధ్య రామమందిరానికి వెళ్తే, గుడిని శుభ్రం చేయాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ కామెంట్ చేశారు. ఇది రాష్ట్రపతిని, గిరిజనులను, మహిళలను, మొత్తం దేశాన్ని అవమానించడమే” అని మండిపడ్డారు.

సీఎంకు జిల్లాల పేర్లే తెలియవు.. 

రాష్ట్రంలోని జిల్లాల పేర్లు కూడా సీఎం నవీన్ పట్నాయక్ చెప్పలేరని మోదీ విమర్శించారు. ‘‘పేపర్ లేకుండా రాష్ట్రంలోని జిల్లాల పేర్లను సీఎం చెప్పలేరు. ఇక ప్రజల సమస్యలను ఏం అర్థం చేసుకుంటరు” అని అన్నారు.