రజనీకాంత్ సినిమా శివాజీ చూసే ఉంటారు. విదేశాలకు వెళ్లి బాగా సంపాదించుకుని వచ్చి.. సేవ చేద్దామంటే.. అతన్ని ఎలా ఇబ్బంది పెడతారో. అచ్చం అలాంటి స్టోరీ కాకపోయినా.. అలాగే సేవ చేద్దామని స్వదేశానికి వచ్చిన డాక్టర్ దంపతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి వారి నుంచి 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు దుండగులు. ఆ సినిమాలో విలన్లు హీరోను ఇబ్బందులకు గురిచేస్తే.. ఇక్కడ సైబర్ నేరగాళ్లు డాక్టర్ దంపతులను రెండు వారాలు నిర్బంధించి భారీ మోసానికి పాల్పడ్డారు.
ఢిల్లీకి చెందిన ఎన్నారై (NRI) డాక్టర్ దంపతులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 14.85 కోట్ల రూపాయలు మోసపోయారు. దంపతులను డిజిటల్ అరెస్టు చేసి క్రిమినల్స్ దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
డా. ఓం తనేజా, ఢా.ఇందిరా తనేజా అనే ఇద్దరు దంపతులు దాదాపు 48 ఏళ్లు అమెరికాలో డాక్టర్లుగా పనిచేసి.. స్వదేశానికి సేవ చేద్దామని 2015లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటినుంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారు. అలాంటి డాక్టర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. ఈ ఫ్రాడ్ 2025, డిసెంబర్ 24న ప్రారంభమైంది. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అరెస్టు వారెంట్స్, తప్పుడు క్రిమినల్ కేసులతో బెదిరించారు. మనీ లాండరింగ్, సెక్యూరిటీ ఉల్లంఘనలు చేశారనే పేరున అరెస్టు చేస్తామని భయపెట్టారు.
►ALSO READ | చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న 24 మంది అరెస్ట్.. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్
డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు వీడియో కాల్స్ ద్వారా వారిని ఇంటికే పరిమితం అయ్యేలా చేశారు. బయటికి వెళ్లకుండా.. ఏం చేయాలన్నా తమ పర్మిషన్ తీసుకోవాలని అనుక్షణం నిఘా పెట్టారు. బంధీలుగా ఉన్న సమయంలో డా.ఇందిరా తనేజా అకౌంట్ నుంచి వివిధ బ్యాంకులకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఒక సారి రూ.2 కోట్లు, ఒకసారి రూ.2 కోట్ల పది లక్షలు.. ఇలా మొత్తం 14 కోట్ల 85 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఇందిరా తనేజా (77) డిజిటల్ అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆ సమయంలో తనను బ్యాంకులలో డబ్బులు తీసేందుకు.. ఇతర బ్యాంకులకు బదిలీ చేసేలా ఒత్తిడి చేశారని తెలిపారు. తన భర్తను ఇంట్లోను ఇంట్లోనే బంధించి తనను బ్యాంకులకు పంపించినట్లు చెప్పారు. తన భర్త ఫోన్ ద్వారా వీడియో కాల్ చేస్తూ.. తనను ఎక్కడికీ కదలనివ్వలేదని.. ఫోన్ కాల్ కూడా చేసుకోనివ్వలేదని తెలిపారు. అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే ప్రశ్నలకు.. ప్రీప్రాన్డ్ గా సమాధానాలు చెప్పించినట్లు తెలిపారు.
ఈ భారీ సైబర్ స్కామ్ జనవరి 10వ తేదీన పోలీసుల దృష్టికి వచ్చింది. వివిధ అకౌంట్లోకి పంపించిన ఫండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరిగి పంపిస్తుందని చెప్పిన దుండగులు.. తర్వాత రిప్లై ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. స్పెషల్ టీమ్స్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
