- 21 మంది మృతి, మరో 9 మంది సీరియస్
- ప్రధాని, ఏపీ గవర్నర్, రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి
- ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు
- దోషులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిక
- మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని పటాకుల తయారీ కేంద్రంలో శనివారం జరిగిన భారీ పేలుడులో 21 మంది చనిపోయారు. తీవ్రగాయాలైన మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
గ్రామంలో పంట పొలాల మధ్య ఉన్న పటాకుల తయారీ కేంద్రంలో మధ్యాహ్నం లంచ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న 21 మంది స్పాట్లోనే చనిపోయారు. వారి డెడ్ బాడీలు పంట పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రగాయాలపాలైన మరో తొమ్మిది మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తున్నది. కాగా, పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించింది. పంట పొలాల మధ్యలో పక్కపక్కనే ఐదు షెడ్లలో పటాకుల తయారీ కేంద్రం ఉండడం, ఒకేసారి పేలుళ్లు జరగడంతో బాధితులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. పైగా పేలుళ్ల ధాటికి మృతదేహాలు నలువైపులాఎగిరి పడ్డాయని స్థానికులు చెప్తున్నారు. బయట పార్క్చేసిన టూవీలర్స్ కూడా తుక్కు కింద మారిపోయాయి.
బురద కారణంగా ఘటనాస్థలానికి సకాలంలో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు చేరుకోలేకపోయాయి. దీంతో దఫదఫాలుగా గంటల కొద్దీ పటాకులు పేలుతూనే ఉన్నాయని, దీంతో సహాయకచర్యలు చేపట్టలేకపోయామని స్థానికులు వాపోయారు.
ఫలితంగా మృతుల సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు. లంచ్‌టైం కావడంతో చాలామంది బయటకు వెళ్లారని, దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. కాగా, పొలాల్లో షెడ్లు వేసి పటాకులు తయారు చేస్తున్నారని, మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని స్థానిక ఆర్డీవో తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే దాని యజమాని పరార్ కావడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మృతుల్లో 11 మంది గుర్తింపు
ఈ ప్రమాదంతో 21 మంది చనిపోగా.. శనివారం రాత్రి 12 గంటల వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు పేర్కొన్నారు. ఇంకా కొద్ది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
మృతుల కుటుంబాలను ఓదార్చిన ఏపీ సీఎం చంద్రబాబు
శనివారం ఉదయం విజయనగరం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి నుంచే కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.
ప్రమాదానికి కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం వేట్లపాలంలో పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఏపీ సీఎం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈ పేలుడులో 21 మంది మరణించడం చాలా బాధాకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. ఘటనపై విచారణ జరుపుతామని దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామని సీఎం హెచ్చరించారు. ఈ ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
వేట్లపాలంలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది .
వేట్లపాలెం ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాను. వారు ఘటానాస్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని చెప్పాను.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్–
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
కాకినాడ జిల్లా, వేట్లపాలెం పటాకుల తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇది మాటలకందని విషాదం
వేట్లపాలెంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది.
- మంత్రి నారా లోకేశ్–
