రెండు నెలల కొడుకు ఏడుపును కూడా భరించలేని కసాయి తల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో పడేసింది !

రెండు నెలల కొడుకు ఏడుపును కూడా భరించలేని కసాయి తల్లి..  నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో పడేసింది !

అమ్మతనం.. ఈ ప్రపంచంలో అన్నింటికన్న గొప్పది.. ఏ ప్రేమతోనీ, త్యాగంతోనీ పోల్చలేనిది. తొమ్మిది నెలలు మోసి, పురిటి నొప్పులు భరించి, చావు వరకు వెళ్లి పునర్జన్మను పొందిన గొప్ప జన్మ. అలా నవమాసాలు మోసి కన్న కొడుకును.. ముక్కుపచ్చలారక ముందే చంపేసింది. ఆ పసిగుడ్డు ఏడుపు ఆమెను ఇబ్బంది పెట్టిందట. కన్న కొడుకు ఆకలి కేకలను పాలిచ్చి చల్లార్చాల్సిన తల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి భగభగ మండుతున్న పొయ్యిలో పడేసి చంపేసింది. ఇలాంటి తల్లినే కదా కసాయి తల్లి అనేది. 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో జరిగింది ఈ అమానవీయ ఘటన. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ లో తన 2 నెలల కన్న కొడుకును చంపేసింది ఈ కసాయి తల్లి. ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడని  చేతులు కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి కట్టేల పొయ్యిలో పడేసింది. పొయ్యిలో సగం  కాలిపోయి.. గాయాలతో ప్రాణాలు వదిలాడు బాలుడు. 

►ALSO READ | హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్.. సైబర్ క్రైం కేసుల్లో 104 మంది అరెస్ట్.. 200 మొబైల్స్ సీజ్

కుత్బుల్లాపూర్  ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన రాజేంద్ర(22), మమత(19) అనే దంపతులు గత కొద్ది రోజులుగా బౌరంపేట లో నిర్మాణం లో ఉన్న  సనారెల్లి అపార్ట్మెంట్స్ వద్ద కూలి పని చేస్తున్నారు. వీరికి రెండు నెలల బాలుడు ఉన్నాడు. రాజేంద్ర ఉదయం భవన నిర్మాణ పనులకు వెళ్లగా, భార్య  మమత(19)  అపార్టమెంట్ పక్కన రేకులలో  ఉంటూ చూసుకుంటుంది. 

మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం భర్త పనికి వెళ్లాడని నిర్ధారించుకుని 2 నెలల బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి రూములో ఉన్న పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. భర్త మధ్యాహ్నం భోజనం కోసం రూముకి వచ్చి చూడగా పొయ్యిలో బాలుడి మృతదేహం చూసి షాక్ కు గురయ్యాడు. కన్నబిడ్డ మంటల్లో కాలిపోవడం చూసి గుండె పగిలేలా రోదించాడు.

అది గమనించిన చుట్టూ పక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కసాయి తల్లిని అదుపులోకి తీసుకున్నారు.  బాలుడు రోజు ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడనే  మంటల్లో వేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది ఆ మహాతల్లి.  కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.