- రాష్ట్రంలో 1,888 మ్యూల్ అకౌంట్లకు 9,431 సైబర్ క్రైమ్ లింకులు
- వివిధ బ్యాంకులకు చెందిన 137 బ్రాంచీల్లో సోదాలు
- గత ఏడాది నమోదైన సైబర్ నేరాల్లో 4,775 మ్యూల్ ఖాతాల పరిశీలన
- సుల్తాన్ బజార్‌లోని ఒకే ఖాతాకు 496 సైబర్ లింకులు
- సూర్యాపేటలోని నాలుగు బ్యాంకుల్లో 298 మ్యూల్ అకౌంట్లు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల్లో వినియోగిస్తున్న మ్యూల్(బ్యాంకు) ఖాతాలు టార్గెట్‌గా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌బీ) "ఆపరేషన్ క్రాక్‌డౌన్" పేరిట ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. తొలి ఆపరేషన్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వివిధ బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలను తనిఖీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 2025లో నమోదైన కేసుల డేటా ఆధారంగా రాష్ట్రంలో 4,775 మ్యూల్ ఖాతాలను విశ్లేషించినట్లు ఆమె తెలిపారు. వివిధ బ్యాంకులకు చెందిన 137 బ్రాంచీల్లో తెరిచిన 1,888 అనుమానిత మ్యూల్ ఖాతాలను తనిఖీ చేయగా.. వాటికి రాష్ట్రవ్యాప్తంగా 782 కేసులు సహా దేశవ్యాప్తంగా నమోదైన 9,431 సైబర్ క్రైమ్ కేసులతో లింకులు ఉన్నాయని వెల్లడించారు.
కాగా, ఆపరేషన్ క్రాక్‌డౌన్ సిరీస్‌లో మొదటి ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని బ్యాంకుల్లో సోదాలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 512 మంది అధికారులతో కూడిన 137 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాలు 137 బ్యాంకు శాఖలను సందర్శించి తనిఖీ చేశాయి. అనుమానిత ఖాతాదారుల కేవైసీ వివరాలను సేకరించాయి. ప్రస్తుతం ఆయా ఖాతాల ధృవీకరణ జరుగుతోంది. బ్యాంకు సిబ్బంది, ఏజెంట్ల నెట్‌వర్క్ కుట్రతో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఓపెన్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ నుండి పని చేస్తున్న ఒకే ఖాతాపై 496 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఉన్నట్లు సీఎస్‌బీ దర్యాప్తులో వెలుగు చూసింది. సూర్యాపేట జిల్లాలో నాలుగు బ్యాంకుల్లోని 298 మ్యూల్ ఖాతాలు సైబర్ నేరాలకు లింక్ అయ్యాయని సీఎస్‌బీ గుర్తించింది.
మ్యూల్ అకౌంట్లతోనే ఆర్టీజీఎస్
మ్యూల్ ఖాతాలు తెరిచే వ్యక్తులకు సంబంధించిన ఆధారాలు, ధృవీకరణ పత్రాలను బ్యాంకు అధికారులు పరిశీలించడం లేదని సీఎస్‌బీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతోపాటు ఆర్టీజీఎస్ నిర్వహించే సాంకేతిక సామర్థ్యం లేని చిన్న బ్యాంకులు సైతం నిధుల బదిలీ కోసం జాతీయ బ్యాంకుల ఆర్టీజీఎస్‌ను ఉపయోగిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇలాంటి మ్యూల్ అకౌంట్లకు సంబంధించిన ధృవీకరణ, ఆర్థిక మార్గాల విశ్లేషణ, ఖాతాదారుల వివరాలను రూపొందించడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సైబర్ ఖాతాల నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంతో పాటు అంతర్-రాష్ట్ర సైబర్ ఆర్థిక మోసాలను నిరోధించేందుకు చేపట్టిన"ఆపరేషన్ క్రాక్‌డౌన్"పై డీజీపీ శివధర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ సహా సీఎస్‌బీ సిబ్బందిని అభినందించారు.
