హుబ్బళి: రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 67 ఏళ్లుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి టైటిల్‌తో ఉపశమనం కలిగించింది. టోర్నీ మొత్తం అసాధారణంగా ఆడుతూ తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కర్నాటకతో శనివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయ్యింది. దాంతో తొలి ఇన్నింగ్స్ (584 రన్స్) ఆధిక్యం కారణంగా జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు.
తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటక 293 రన్స్‌కే ఆలౌటైంది. ఇక 186/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌ను 113 ఓవర్లలో 342/4 స్కోరు వద్ద డిక్లేర్ చేశారు. కమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్), సాహిల్ లోత్రా (101 నాటౌట్) సెంచరీలతో దుమ్మురేపారు. ఈ జోడీని విడగొట్టేందుకు కర్నాటక బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు.
కేఎల్ రాహుల్‌తో కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయించారు. అయినా కమ్రాన్, సాహిల్ ఐదో వికెట్‌కు 197 రన్స్ జోడించి క్రీజులో పాతుకుపోయారు. చివరకు 2 గంటల 10 నిమిషాలకు ఇరుజట్ల కెప్టెన్లు డ్రెస్సింగ్ రూమ్‌లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ప్రసిధ్ కృష్ణ 2, విజయ్ కుమార్, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.
శుభమ్ పుండిర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అకిబ్ నబీకి (245 రన్స్, 60 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 2013–14, 2019–20, 2024–25 సీజన్లలో క్వార్టర్ ఫైనల్ చేరిన జమ్మూ కశ్మీర్ ఫైనల్‌కు అర్హత సాధించడం మాత్రం ఇదే తొలిసారి. చరిత్రాత్మక విజయానికి సాక్షిగా నిలిచిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్లేయర్లను ప్రశంసలతో ముంచెత్తారు. తొలి కప్ నెగ్గిన జట్టుకు రూ. 2 కోట్ల క్యాష్ రివార్డును ప్రకటించారు. ఇటీవల నోటిఫై చేసిన రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తామన్నారు.
