వెలుగు ఓపెన్ పేజీ.. శాంతికోసమే బుద్ధదమ్మ పాదయాత్ర

వెలుగు ఓపెన్ పేజీ.. శాంతికోసమే బుద్ధదమ్మ పాదయాత్ర

వేదభూమి, కర్మభూమిగా  కీర్తిస్తున్న  భారతదేశంలో  గౌతమ బుద్ధుని  బోధనలు  నేటికీ సజీవంగా ప్రతిధ్వనిస్తున్నాయి.  వేల ఏళ్లుగా మన దేశంలో వేళ్లూనుకున్న చాతుర్వర్ణ వ్యవస్థను,  వైదిక మత ఆచార వ్యవహారాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి అహింస, శాంతి, సత్యాన్వేషణ, జ్ఞానమార్గం ద్వారా ప్రపంచంలో శాంతి, కరుణ,  సమానత్వం విలసిల్లాలనే  మహత్తర  ఆశయంతో  గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు.

వైదిక మతం  సృష్టించిన వర్ణవిభేదాలు, యజ్ఞయాగాల పేరిట  జరుగుతున్న జీవహింస, మారణహోమ యుద్ధాలను బౌద్ధం  తీవ్రంగా ఖండించింది. ప్రజలందరూ ఆచరించే విధంగా బౌద్ధ సిద్ధాంతాలను బుద్ధుడు రూపొందించాడు. సమాజంలో  పురోహిత వర్గం (బ్రాహ్మణ) ఆధిపత్యాన్ని శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నిస్తూ, మానవ సమానత్వానికి ప్రాముఖ్యతనిచ్చింది. మానవునిలో  అంతులేని  కోరికలే దుఃఖానికి మూలమని, వాటిని జయించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుందని ఆయన  హితబోధ  చేశాడు. 

బుద్ధుడి బోధనల పుట్టినిల్లు భారతదేశంలో..

గౌతమ బుద్ధుని బోధనల పుట్టినిల్లయిన భారతదేశంలో బౌద్ధాన్ని  పునరుద్ధరించాలనే  లక్ష్యంతో,  అయన  ధర్మ సందేశాలపై  ప్రజల్లో మళ్లీ అవగాహన పెంపొందించి, ప్రపంచవ్యాప్తంగా అహింస–శాంతి స్థాపనకు పునాదులు వేయాలనే సంకల్పంతో 60 మంది థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువులు, భిక్షుణిలు, వారితోపాటు మరో 10 మంది  భారతీయ  బౌద్ధులు,  ఉపాసకులు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా  ‘బుద్ధదమ్మ పాదయాత్ర’ నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక అంతర్రాష్ట్ర పాదయాత్ర సుమారు 450 కిలోమీటర్లు  కొనసాగనుంది. 

ఫిబ్రవరి 2న కర్ణాటకలోని  కలబుర్గిలోని  సిద్ధార్థ  బుద్ధ విహార  నుంచి ప్రారంభమై, మార్చి 2న నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనానికి చేరనుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సంగ ప్రాజెక్ట్ డైరెక్టర్  సోంగ్‌శాక్ కోవిడో నాయకత్వంలో, ముంబైకు చెందిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్  సమన్వయంతో  ‘బుద్ధదమ్మ పాదయాత్ర’ సాగుతోంది.  ఈ యాత్రలో  బౌద్ధ భిక్షువులు  ప్రతిరోజూ సగటున ఆరు గంటలు చెప్పులు   లేకుండా నడుస్తూ,  తమ వ్యక్తిగత అవసరాల కోసం సుమారు 8 కిలోల సామగ్రిని తమ భుజాలపై మోస్తున్నారు. 

అందులో భిక్షా పాత్ర (అల్మ్స్ బౌల్), నిద్రించే నెట్ (స్లీపింగ్ నెట్), ఇతర అవసర వస్తువులు ఉంటాయి. భిక్షువులు రోజుకు ఒక్కసారి ఉదయం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. ఈ యాత్రలో పాల్గొంటున్న అనేక భిక్షువులు గత తొమ్మిది సంవత్సరాలుగా ఇలాంటి దమ్మయాత్రల్లో పాల్గొంటున్నారు. ఒక సంవత్సరంపాటు కఠిన శిక్షణ పొందిన తర్వాత,  భిక్షు జీవన విధానాన్ని నియంత్రించే 227 సన్యాస నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమ సాధనను కొనసాగిస్తున్నారు.

ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధం

అశోకుని పాలనలో నిర్మించిన 84వేల బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచాయి.  సాంచి స్తూపం, సారనాథ్ స్తూపం, అశోక స్తంభాలు వంటి నిర్మాణాలు భారతదేశ శిల్పకళా చరిత్రలో కీర్తిపతాకాలుగా నేటికీ అలరారుతున్నాయి. అశోకుని ధర్మప్రచారం వల్ల బౌద్ధం దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్తమై, నేడు ఆసియా ఖండంలో  కోట్లాది మంది బౌద్ధాన్ని విశ్వసించి ఆచరించడం ఆయన ధర్మప్రచార  ఫలితమే.

అంబేద్కర్ - బౌద్ధం పునరుద్ధరణ 

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ బుద్ధుని మార్గంలో  పయనించి, భారతదేశంలో  క్షీణించిన బౌద్ధం  పునరుద్ధరణకు  సంకల్పించాడు.   ‘సాటి మనిషిని మనిషిగా  గుర్తించని మతంలో నేను జీవించలేను’  అని  స్పష్టంగా బహిరంగంగా ప్రకటించి సమానత్వం,  గౌరవం కలిగిన బౌద్ధాన్ని స్వీకరించాడు.  డా. బి.ఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో ఐదు లక్షల మందితో కలిసి బౌద్ధాన్ని స్వీకరించారు. బుద్ధుడు జన్మించిన ఈ నేల నుంచే బౌద్ధం ఆవిర్భవించి ఆసియా ఖండమంతట విస్తరించినా, భారతదేశంలో దాని ఉనికి పరిమితంగానే ఉండటం గమనార్హం. 

అయినప్పటికీ, దక్షిణ  భారతదేశంలో తొలిసారిగా సాగుతున్న బుద్ధదమ్మ పాదయాత్రకు కర్నాటక, తెలంగాణలోని అన్ని మతాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. దేవాలయాలు, క్రైస్తవ సంస్థలు, మసీదులు, సిక్కు సంఘాలు  భిక్షువులకు ఆహారం,  విశ్రాంతి,  ప్రోత్సాహం అందించడం మతసామరస్యానికి  ప్రతీక. ఈ బౌద్ధ  దమ్మయాత్ర  కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. బుద్ధుడు ప్రబోధించిన అహింస, సమానత్వం, శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే యాత్ర.-

 డా.చెట్టుపల్లి మల్లిఖార్జున్

NOTE : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
  openpage@v6velugu.com
 రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
 హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.