- నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘటన
కోటగిరి, వెలుగు: కన్న తల్లిని కొట్టి, నిప్పంటించి హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కలకలం రేపింది. ఎస్సై సునీల్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరిలోని బ్రాహ్మణ గల్లీకి చెందిన పద్మశాలి భూమవ్వ(70), కొడుకు మానాజీ కలిసి ఉంటున్నారు. పెళ్లి లేకుండా మద్యానికి బానిసై తిరుగుతున్న మానాజీ కొద్ది రోజుల కింద భూమవ్వను మద్యం కోసం డబ్బులు అడగగా, ఇవ్వకపోవడంతో దాడి చేయడంతో ఆమె నడుము విరిగింది.
అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటున్న భూమవ్వ కూతురు మాదవ్వ ప్రతి రోజూ తల్లికి భోజనం పెట్టేది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి మానాజీ తల్లిపై దాడి చేసి, కల్లు సీసా, రోకలిబండతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తల్లి చనిపోయిన విషయాన్ని అక్క మాదవ్వకు, విఠలేశ్వర్ మందిర్‌లో జరుగుతున్న భజన కార్యక్రమం వద్దకు వెళ్లి చెప్పాడు. డెడ్‌బాడీని కూతురు మాదవ్వ స్థానికుల సాయంతో బయట గదిలో ఉంచగా, తల వద్ద ఉన్న దీపంతో తల్లి శవానికికొడుకు నిప్పంటించగా, స్థానికులు ఆర్పివేశారు.
మరోసారి తలకు నిప్పంటించినా అక్కడ ఉన్నవారు చల్చార్చారు. అందరూ పడుకున్నాక మరోసారి ఇంట్లోని పాత గుడ్డలు వేసి నిప్పు పెట్టటంతో మానవ్వ కాళ్లు, ఛాతీ, తల పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై సునీల్ వివరాలు కరించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బిచ్కుందలో ఆస్తి తగాదాలతో అన్న హత్య..
పిట్లం: ఆస్తి తగాదాలతో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద గ్రామానికి చెందిన మెరుగు సాయిలు శుక్రవారం రాత్రి పాలగుండం ఆలయం వద్ద హతమయ్యాడు. స్థానికుల పిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి తమ్ముడు నారాయణ హత్య చేసినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల మధ్య చాల రోజులుగా భూ తగదాలు జరుగుతున్నాయి. దీనిని మనసులో పెట్టుకుని అన్నపై కర్రతో తలపై కొట్టడంతో తీవ్రగాయాలతో సాయిలు చనిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
