ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ‘ఏఐ అనేది నైతికంగా, బాధ్యతాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండాలి’ అని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలు వికృత పోకడలకు కేంద్రాలుగా మారుతున్నాయి. వాట్సప్, టెలీగ్రాం చానెల్స్ పుట్టుకొస్తున్నాయి. వ్యూస్, లైక్స్ సంపాదించడమే లక్ష్యంగా కొందరు క్రియేటర్లు మహిళల ఆత్మగౌరవాన్ని బజారున పడేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మహిళా రూపాలను సృష్టించి, వారిచేత అసభ్యకరమైన ద్వంద్వార్థ సంభాషణలు పలికిస్తున్నారు. ఈ వికృత క్రీడ నేడు అంతర్జాలంలో ఒక పెద్ద ముప్పుగా పరిణమించింది. కేవలం ఆర్థిక లాభాపేక్షతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ఇది సమాజంలో నైతిక విలువల పతనాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
డిజిటల్ దాడులు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను, గౌరవాన్ని తీవ్రంగా హరిస్తున్నాయి. ఇతర సైబర్ క్రైంలలో బిజీగా ఉండే సైబర్ బ్యూరో నోడల్ ఏజెన్సీ తప్ప ఇలాంటి వికృత అశ్లీల సంభాషణ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ యంత్రాంగం ఏదీ లేదు.
నైతికతకు తిలోదకాలు
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందాలనే పిచ్చి నేడు పరాకాష్టకు చేరింది. వ్యూస్ సంఖ్యను పెంచుకోవడమే పరమావధిగా భావిస్తున్న క్రియేటర్లు విలువలని కాలరాస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఏఐ ద్వారా సృష్టించిన మహిళా పాత్రల నోట పచ్చిబూతులు, ద్వంద్వార్థాలు జోడించి వీడియోలు రూపొందిస్తున్నారు. పైకి మామూలుగా అనిపించినా, లోపల అసభ్యత దాగి ఉండేలా అత్యంత చాకచక్యంగా స్క్రిప్టులు రాస్తున్నారు. యువతను తప్పుదోవ పట్టించడానికి, వారిలో వికృత కోరికలను రేకెత్తించడానికి ఈ కంటెంట్‌ను వాడుతున్నారు. ఈ వ్యూస్ పిచ్చివల్ల సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. పవిత్రమైన బంధాలను సైతం అవహేళన చేస్తూ ఏఐ గొంతులతో అశ్లీల సంభాషణలు సృష్టిస్తున్నారు. ఇది సమాజం మీద, ముఖ్యంగా పసిపిల్లల మీద చాలా చెడు ప్రభావం చూపుతోంది.
ఏఐ దుర్వినియోగం
నేరగాళ్లు ఇంటర్నెట్‌లో లభించే ఉచిత ఏఐ టూల్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. మహిళల అసభ్యకరమైన కంటెంట్ వైరల్ చేస్తున్నారు. గొంతును అనుకరించే 'వాయిస్ క్లోనింగ్' టెక్నాలజీ ద్వారా అత్యంత సహజంగా బూతులు పలికిస్తున్నారు. గతంలో ఇటువంటి మార్ఫింగ్ గుర్తించడం సులభంగా ఉండేది. కానీ నేడు ఏఐ సృష్టిస్తున్న దృశ్యాలు అసలైనవాటికి ఏమాత్రం తీసిపోవు. మానవ మేధస్సును సైతం తలదన్నేలా ఏఐ అత్యంత సహజ సిద్ధమైన నకిలీ దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. దీనివల్ల బాధితులు ఆ వీడియో నకిలీ అని నిరూపించుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఒక మహిళ నిజంగానే ఆ మాటలు మాట్లాడుతోందని నమ్మించేలా ఈ సాంకేతికత నేడు నేరగాళ్లకు ఆయుధంగా మారింది.
మహిళల వ్యక్తిత్వ హననం
ఒక సాధారణ మహిళ ఫొటోను ఏఐ టూల్స్ లో పెట్టి, ఆమె నోటివెంట అసభ్యకరమైన జోకులు చెప్పించడం నేడు ఒక ఫ్యాషన్‌గా మారింది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి లేదా పగ తీర్చుకోవడానికి ఈ పద్ధతిని విరివిగా వాడుతున్నారు. రాజకీయాల్లో రాణిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏఐ ముసుగులో అసత్య ప్రచారాలను వేగవంతం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం వల్ల నిజమైన మహిళా ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నెటిజన్లు కూడా ఇలాంటి వాటిని లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా ఈ వికృత క్రీడలో భాగస్వాములు అవుతున్నారు. నేరగాళ్లు విదేశీ సర్వర్లను వాడుతూ పట్టుబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏఐ ద్వారా మహిళలను అసభ్యంగా చూపించే యాప్‌లు ఇంటర్నెట్‌లో సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. నిందితులు ఇతరుల ముఖాలను వాడుకుంటూ వినోదం పొందుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, ఇది ఒక సామాజిక విపత్తు. ప్రతిగంటకు వేలాదిగా పుట్టుకొస్తున్న ఈ నకిలీ వీడియోలను నియంత్రించడం చాలా కష్టమవుతోంది. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఈ కంటెంట్ కారణమవుతోంది.
చట్టపరమైన చర్యలు
ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది. ఏఐ ద్వారా సృష్టించిన అసభ్యకర కంటెంట్‌ను బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే తొలగించాల్సి ఉంటుంది. పోలీసులు అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించే నేరగాళ్లను వేటాడుతున్నారు. అనామక ఖాతాల వెనుక దాక్కున్నా ఐపీ అడ్రస్ ద్వారా వారిని గుర్తిస్తున్నారు. మహిళలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్‌లో ఉంచుకోవాలి. అపరిచితులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపకూడదు.
అనుమానాస్పదంగా అనిపించే ఏ లింక్‌ను క్లిక్ చేయకూడదు. మీ ప్రమేయం లేకుండా దృశ్యాలు ప్రచారంలో ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్ సంప్రదించి నేరాన్ని నివేదించాలి. ప్రస్తుత చట్టాలైన ఐటీ చట్టం 2000, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం 2023 ద్వారానే అనేక ఏఐ రిస్కులను ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సమాచార సాంకేతిక (ఐటి) నిబంధనలు, 2021లోని నియమం 2(1)(wa) ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి కృత్రిమంగా సృష్టించిన, సవరించిన లేదా మార్చిన ఆడియో, విజువల్ లేదా ఆడియో- విజువల్ కంటెంట్ అని నిర్వచించడమైనది.
ఫిబ్రవరి 20, 2026 నుంచి కొత్త ఐటీ సవరణ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం సోషల్ మీడియాలో ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు, వీడియోలు లేదా ఆడియోలకు తప్పనిసరిగా "AI- generated" అనే లేబుల్ ఉండాలి. నియమం 3(1)(d) ద్వారా హానికరమైన డీప్‌ఫేక్ లేదా అభ్యంతరకరమైన ఏఐ కంటెంట్‌ను ఫిర్యాదు అందిన 3 గంటల్లోపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సామాజిక బాధ్యత
సాంకేతికత మానవ వికాసానికి సోపానం కావాలి తప్ప, మహిళా హక్కులు కాలరాసే ఆయుధం కాకూడదు. డిజిటల్ మర్యాదను పాటించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత. మహిళలను ఏఐ ద్వారా అసభ్యంగా చూపించే సంస్కృతిని సమాజం ఛీత్కరించుకోవాలి. కేవలం చట్టాలు మాత్రమే మార్పును తీసుకురావు, ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఏఐ వీడియోలను చూడటం లేదా వాటిని ఫార్వర్డ్ చేయడం కూడా ఒక నేరమని గుర్తించాలి. విద్యాసంస్థలు విద్యార్థులకు డిజిటల్ నీతిని బోధించాలి.
మహిళల పట్ల గౌరవం పెరగాలి. సాంకేతికతను సృష్టించిన కంపెనీలు దానికి భద్రతా కవచాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే డిజిటల్ ప్రపంచంలో మహిళలు నిర్భయంగా ఉండగలరు. విజ్ఞానం వినాశనానికి దారితీయకూడదు. సాంకేతికతను సృజనాత్మకతకు వాడుకుంటూనే, తోటి మనుషుల గౌరవాన్ని కాపాడే నైతిక విలువలను పెంపొందించుకోవాలి.
- డా. కట్కూరి,సైబర్ సెక్యురిటీ న్యాయ నిపుణుడుNOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
