హోబర్ట్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన ఇండియా విమెన్స్ జట్టు పరువు కోసం పాకులాడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిచి విజయంతో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు మోస్తరుగా ఆడటంతో భారీ స్కోర్లు చేయలేకపోయింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడటం ఇండియా బ్యాటింగ్ బలహీనతలను స్పష్టం చేస్తోంది.
ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానతో పాటు జెమీమా, హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంది. బౌలింగ్ కూడా అస్థిరంగానే కనిపిస్తోంది. దీప్తి, శ్రీచరణి వికెట్లు తీస్తున్నా.. రన్స్ నిరోధించడంలో ఫెయిలవుతున్నారు. పేసర్లు కశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్ పవర్‌ప్లేలో ఆసీస్‌ను అడ్డుకోవాలి. టీమిండియా ఫీల్డింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి ఏకైక టెస్ట్‌లో బ్యాటింగ్ బలాన్ని చూపెట్టాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు ఆసీస్ అన్ని అంశాల్లో చాలా బలంగా కనిపిస్తోంది. జార్జియా వోల్, లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, అలీసా హీలీ, సదర్లాండ్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మేగన్ షుట్, ఆష్లే గార్డ్‌నర్, అలనా కింగ్, సదర్లాండ్‌తో కూడిన బౌలింగ్‌ను నిలువరించాలంటే ఇండియా శక్తికి మించి శ్రమించాలి.
