కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ నగరం బొమ్మకల్ చల్మెడ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు అదే హాస్పిటల్లో పని చేసే యువతిని ప్రేమిస్తున్నానని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు అతడికి సహకరించిన తల్లిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువతి చెల్మెడ హాస్పిటల్లో పని చేస్తోంది.
ఆమెను ఇదే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న బొమ్మకల్‌కు చెందిన బాగోతం రాకేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. రాకేశ్ తల్లి పద్మకు ఈ విషయాన్ని చెప్పగా, పెళ్లి చేసుకుంటారుగా అని కొడుకును వెనకేసుకొచ్చింది. నవంబర్ లో గర్భం దాల్చిన బాధితురాలు పెళ్లి చేసుకోవాలని కోరగా, రాకేశ్ ట్యాబ్లెట్లు తీసుకువచ్చి వాటిని వేసుకోవాలని బెదిరించాడు. ఆ తరువాత కొడుకు, తల్లి కులం పేరుతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తల్లి, కొడుకుపై అట్రాసిటీ కేసు, అత్యాచారం కేసు నమోదు చేశారు. శనివారం పద్మ, రాకేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.
