న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు (329) బాదిన తొలి ప్లేయర్‌గా రేర్ ఫీట్ నెలకొల్పాడు. వడోదరలోని బీసీఏ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (328) పేరిట ఉండేది.
గేల్‌ను అధిగమించి రోహిత్ ఈ ఎలైట్ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక, వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ ఇప్పటికే హిట్ మ్యాన్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. వన్డే క్రికెట్లో రోహిత్ ఇప్పటి వరకు 357 సిక్సులు బాదాడు. 351 సిక్సర్లతో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
►ALSO READ | IND vs NZ: నువ్వు కొట్టి నువ్వే షాక్‌లోకి వెళ్తే ఎలా.. అయ్యర్ మెరుపు రనౌట్‌కు స్టేడియం ఫిదా
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ అంచనాల మేర రాణించలేదు. 301 పరుగుల భారీ లక్ష్యంతో ఇండియా బరిలోకి దిగగా రోహిత్ 21 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి టచ్‌లో కనిపించిన హిట్‌మ్యాన్ జేమిసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటై తీవ్ర నిరాశతో క్రీజును వీడాడు. విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ గిల్ (56) హాఫ్ సెంచరీలకు తోడు వైస్ కెప్టెన్ అయ్యర్ (49) రాణించడంతో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది.
వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు:
- రోహిత్ శర్మ 329
- సచిన్ టెండూల్కర్ 167
- క్రిస్ గేల్ 328
- సనత్ జయసూర్య 263
- మార్టిన్ గుప్టిల్ 174
-
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు:
- రోహిత్ శర్మ 357
- షాహిద్ అఫ్రిది 351
- క్రిస్ గేల్ 331
- సనత్ జయసూర్య 270
- ఎంఎస్ ధోని 229
