బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్: మరో రెండు కొత్త పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్..

బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్: మరో రెండు కొత్త పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్..

సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం.. మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. సోమవారం (జనవరి 12) హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించారు. 

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని.. అన్ని రకాలుగా ఉంటామని చెప్పారు. రూ.50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్ఫూర్తి అని గుర్తు చేశారు సీఎం రేవంత్. వైకల్యం ఉందనే ఆలోచనను కూడా ఆయన రానివ్వలేదన్నారు. ఆయన సక్సెస్ ను దివ్యాంగులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ALSO READ : మున్సిపల్ కార్పోరేషన్లలో కోఆప్షన్ కింద ట్రాన్స్ జెండర్లకు అవకాశం

విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని చెప్పారు సీఎం. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చినట్లు గుర్తు చేశారు.

కో ఆప్టెడ్ మెంబర్లుగా ట్రాన్స్ జెండర్లు:

ట్రాన్స్ జెండర్లకు కూడా సమాజంలో ఆదరణ తక్కువగా ఉంటుందని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. కార్పోరేన్లలో ట్రాన్స్ జెండర్లను నామినేట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ కార్పోరేషన్లలో కోఆప్షన్ కింద వారిని ఎన్నుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోన్నట్లు చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. 

ALSO READ : ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం కట్:

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ALSO READ : ఇవాళ, రేపు GHMC పరిధిలో.. మెగా ఈ-వేస్ట్ సానిటేషన్ డ్రైవ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే మా విధానం  అని తెలిపారు సీఎం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామని అన్నారు. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోందని చెప్పారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించిందని గుర్తు చేశారు.