టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవర కొండ, రష్మిక మండన్న రీసెంట్ గా వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరి మ్యారేజ్ డిజిటల్ వరల్డ్ లో ప్రభంజనం సృష్టించింది. ఈ నెల 26న ( ఫిబ్రవరి , 2026) రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభంగా జరిగింది. ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో 'విరోష్' ప్రభంజనం
పెళ్లి జరిగిన కొద్దిసేపటికే రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను 'నా భర్త' అని పరిచయం చేస్తూ షేర్ చేసిన ఫోటోలు డిజిటల్ రికార్డులన్నింటినీ మటాష్ చేశాయి. కేవలం 48 గంటల్లోనే రష్మిక వెడ్డింగ్ పోస్ట్‌కు 24 మిలియన్ల (2.4 కోట్లు) లైక్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. దీంతో భారతదేశం నుండి అత్యధిక లైక్స్ పొందిన ఫోటోగా ఇది చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2024 టీ20 ప్రపంచకప్ విజయం సందర్భంగా విరాట్ కోహ్లీ పెట్టిన ఫోటో (22.8 మిలియన్ లైక్స్) పేరిట ఉన్న రికార్డును రష్మిక అధిగమించింది.
సెలబ్రిటీ పెళ్లిళ్ల రికార్డులు బద్దలు
భారతీయ సినీ చరిత్రలో మరే స్టార్ కపుల్ పెళ్లి ఫోటోలకు ఈ స్థాయి రెస్పాన్స్ రాలేదు. గతంలో సిద్ధార్థ్ - కియారా (16 మిలియన్లు), రణబీర్ - ఆలియా (13 మిలియన్లు), సమంత - నాగ చైతన్య (12 మిలియన్లు) వంటి ప్రముఖుల రికార్డులన్నీ 'విరోష్' మేనియా ముందు తుడిచిపెట్టుకుపోయాయి. విజయ్ షేర్ చేసిన ఫోటోలకు కూడా 18.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. వీరిద్దరి పోస్ట్‌లకు కలిపి మొత్తం 42 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.
రెండు సంప్రదాయాల్లో వేడుక
ఉదయపూర్‌లోని రాయల్ రిసార్ట్‌లో ఈ వివాహం రెండు పద్ధతుల్లో జరిగింది. ఉదయం విజయ్ కోసం తెలుగు సంప్రదాయంలో, సాయంత్రం రష్మిక కోసం కూర్గ్ (కొడవ) పద్ధతిలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విజయ్, "నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను" అంటూ రాసిన ఎమోషనల్ నోట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది.
గ్రాండ్ గా రిసెప్షన్!
వివాహం ముగిసిన తర్వాత ఈ కొత్త జంట హైదరాబాద్ చేరుకోనుంది. మార్చి 4న బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు దక్షిణాది స్టార్లతో పాటు ముంబై నుండి కూడా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి నటించిన 'రణబాలి' చిత్రం పెళ్లి తర్వాత వీరి మొదటి సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
