అక్రమ ఇసుక దందా చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇసుక రీచ్ ను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా స్థానికుల అవసరాలు తీర్చేందుకు ఇసుక రీచ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తక్కువ ధరకే గోదావరి ఇసుకను అందిస్తామన్నారు.ఈ కొత్త ఇసుక రీచ్ ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ ఎస్ నాయకులు ఇసుక దందాలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు మంత్రి వివేక్. కాంట్రాక్టర్ లు ఇష్టం వచ్చినట్లు దోచుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విమర్శించారు. తాను ఎన్నికల్లో గెలిచిన తరువాత చెన్నూరులో ఇసుక మాఫియా లేకుండా చేశానని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశానన్నారు. తన పైన చాలా మంది ఒత్తిడి చేసినా.. ఇసుక మాఫియాకు ఎలాంటి సహకారం ఇవ్వలేదని చెప్పారు. మైనింగ్ శాఖ అధికారులకు ఇసుక రవాణాను ఆపాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా పైన చాలా సీరియస్ గా ఉందన్నారు.
బీ ఆర్ ఎస్ వాళ్ళు కావాలని తన పైన దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ ఇసుక దందాపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు రాని వాళ్లకు మళ్ళీ ఇస్తామన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వం లో ఫండ్ లేకున్నా శంకుస్థాపన చేసి వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు మింగిన గత నాయకులు..రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు మంత్రి వివేక్.
