హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ఐదేళ్లుగా నడుపుతున్న హైదరాబాద్ దక్కన్ నాంపల్లి-కన్యాకుమారి ఎక్స్ప్రెస్ను (07229/07230) రైల్వే శాఖ రెగ్యులర్ చేసింది. హైదరాబాద్-కన్యాకుమారి వీక్లీ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ చేసిన క్రమంలో రైలు నెంబర్ను మార్చారు. ఇకపై 17069/17070 నంబర్తో ఈ రైలు రాకపోకల సాగించనుంది. ఈ రైలు మాత్రమే కాదు.. కాచిగూడ-మధురై ఎక్స్ప్రెస్ను కూడా ఇకపై వీక్లీ కాకుండా రెగ్యులర్గా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో.. భక్తుల సౌకర్యార్థం ఈ రెండు రైళ్లను రైల్వే శాఖ రెగ్యులర్ చేసింది. కాచిగూడ-మధురై ఎక్స్ప్రెస్ను (17615/17616) ఇకపై తూత్తుకుడి వరకూ నడపాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ రెండు రైళ్లను రెగ్యులర్గా నడపడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీగా అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు అవకాశం లభించింది. హైదరాబాద్-కన్యాకుమారి రైలు నాంపల్లి నుంచి బయల్దేరి సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీలోకి ఎంటర్ అయి చిత్తూరు మీదుగా తమిళనాడుకు వెళుతుంది. ఈ రైలును రెగ్యులర్ చేయడం వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఊరట దక్కినట్టయింది.
