- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని శారద నర్సింగ్ హోంలో ఓ పసికందు చనిపోగా, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన సామ కీర్తన వారం కింద శారద నర్సింగ్ హోంలో అడ్మిట్ అయింది. ఈ నెల 23న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో శుక్రవారం బాబు పాలు తాగడం లేదని కుటుంబ సభ్యులు డాక్టర్‌కు తెలపడంతో సదరు వైద్యుడు చికిత్స అందించాడు.
అనంతరం వారికి తెలియకుండా ఆటోలో డాక్టరే బాబును మరో చిన్న పిల్లల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కాసేపటికే ఆ బిడ్డ చనిపోయాడని డాక్టర్ తెలపడంతో ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ చనిపోయాడని ఆందోళనకు దిగారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
