చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మంత్రి వివేక్వెంకటస్వామి

చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మంత్రి వివేక్వెంకటస్వామి
  • రాష్ట్ర కార్మిక, గనులశాఖ 
  • మంత్రి వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్​/కోటపల్లి, వెలుగు: చెన్నూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూరు మున్సిపల్ ఆఫీస్​లో చైర్​ పర్సన్​పెద్దింటి పద్మ, వైస్​ చైర్ పర్సన్​ నాయకపు వినయ్, కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించగా.. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని​ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలను కాంగ్రెస్​ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించారని తెలిపారు. కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు.

వార్డుల్లో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, అన్నిచోట్లా బోర్​వెల్స్, సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.30కోట్లతో అమృత్​స్కీం 2.0 పనులు చేపట్టామని, మరో 6 నెలల్లో ఇంటింటికీ నీరందిస్తామన్నారు. బీఆర్ఎస్​హయాంలో మిషన్​ భగీరథ పథకం పేరుతో రూ.వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్విరాన్మెంట్, ఇరిగేషన్ పర్మిషన్లు వచ్చాక చెన్నూరులోనే గోదావరి ఇసుక సప్లయ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కారణంగా బిల్లులు రాలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సకాలంలో చెల్లిస్తున్నామని, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన దేవులవాడ, బబ్బెరచెలక గ్రామాల రైతులకు తాను ఎమ్మెల్యేగా గెలిచాక రూ.18 కోట్ల పరిహారం ఇప్పించానని గుర్తు చేశారు. చెన్నూరులో 100 బెడ్స్ ప్రభుత్వ ఆస్పత్రిని మే నెలలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.  మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, కాంగ్రెస్ లీడర్లు చిన్నరామిరెడ్డి, బాపురెడ్డి, కరుణసాగర్​రావు, మున్సిపల్ కమిషనర్​ మురళీకృష్ణ  పాల్గొన్నారు.

బాధితులకు పరామర్శ 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్​ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన కాంగ్రెస్​లీడర్​జావిద్​ను మంత్రి వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి గాంధీనగర్​లోని ఆయన ఇంటికి వెళ్లి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జైపూర్​ మండలం టేకుమట్లలో మాజీ సర్పంచ్​గోనె నర్సయ్య తండ్రి పోషం, చెన్నూరు పట్టణానికి చెందిన ఒద్ది కిరణ్​ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్​లో పలువురి చేరిక 

మంత్రి వివేక్​ వెంకటస్వామి సమక్షంలో చెన్నూరులోని క్యాంప్​ఆఫీస్​లో సుద్దాల సర్పంచ్​డొంగరి స్వప్న, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.