T20 World Cup: కోల్‌కతా అంటేనే బిగ్ మ్యాచ్‌లు, భావోద్వేగాలు గుర్తుకొస్తాయి. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్ ఆడితే అది కేవలం మ్యాచ్‌గా అనిపించదు.. ఒక పండుగలా మారిపోతుంది. రేపు (మార్చ్ 1న) సాయంత్రం ఈ చారిత్రాత్మక స్టేడియంలో మరోసారి అలాంటి సీన్ రిపీట్ కానుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్–8 దశలో భారత్ వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఇది అధికారికంగా క్వార్టర్ ఫైనల్ కాకపోయినా, పరిస్థితుల దృష్ట్యా నాకౌట్ మ్యాచ్‌లా మారిపోయింది. గెలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్, ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
కార్నివల్ మూడ్‌లో ఈడెన్:
ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రెండున్నర నిమిషాల ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్ ని నిర్వహించేందుకు సిద్ధమైంది. లేజర్ లైట్లతో మైదానం మెరిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. ‘సబ్సే ఆగే హోంగే హిందుస్తానీ’, ఒక బెంగాలీ దేశభక్తి గీతం, ‘ధురంధర్’ చిత్రంలోని పాటలు వినిపించనున్నాయి. ముఖ్యంగా ‘వందే మాతరం’ సమయంలో డీజే ప్లేయర్ “వందే” అని అరిస్తే, 70 వేల మంది క్రికెట్ అభిమానులు “మాతరం” అంటూ ప్రతిధ్వనించనున్నారు. మొబైల్ లైట్లు ఆన్ చేసి మొత్తం స్టేడియం వెలుగుతో కాంతులీననుంది. నిర్వాహకులు ఆశించిన విధంగా జరిగితే ఇది ఈడెన్ గార్డెన్స్ చరిత్రలో మరో చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయే అవకాశం ఉంది.
టికెట్లు ఫుల్.. ఉత్సాహంగా నగరం:
గ్రూప్ మ్యాచ్‌ల సమయంలో టికెట్ కౌంటర్లలో పెద్దగా రష్ కనిపించలేదు. కానీ ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారిన వెంటనే పరిస్థితిగా మారిపోయింది. మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ కౌంటర్ల దగ్గర అభిమానులు క్యూలు కట్టారు. ఇప్పటికే చాలా టికెట్లు ఆన్‌లైన్‌లో సేల్ అయ్యాయి. ఫ్యాన్స్ ముందే బుక్ చేసిన పాసులను సేకరించడానికి వచ్చారు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ ఈ రద్దీని 2016లో ఇదే వేదికపై జరిగిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌తో పోల్చారు.
కీలక ఆటగాళ్లు
వెస్టిండీస్ జట్టులో భారీ హిట్టర్లు ఉండగా.. అందులోని ఇద్దరు ప్లేయర్స్ ఫామ్‌లోకి వస్తే మ్యాచ్ దిశ ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. భారత్‌కు కీలక బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో విండీస్ బ్యాటర్లను కట్టడి చేస్తే భారత్‌కు ఆధిక్యం లభిస్తుంది. లేకపోతే మ్యాచ్ చేజారి పోయే ప్రమాదం ఉంది. ఇక వెస్ట్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతుండటంతో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులు మోహరించి ప్రేక్షకుల భద్రత, నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈడెన్ గార్డెన్స్ ఎన్నో వరల్డ్ కప్ ఫైనల్స్, చారిత్రాత్మక శతకాలు, అద్భుత విజయాలు, చేదు పరాజయాలకు వేదికైంది. రేపు జరిగే మరో కీలక అధ్యాయానికి వేదికగా నిలుస్తుంది. గెలిస్తే భారత్ ట్రోఫీకి మరో అడుగు దగ్గరవుతుంది. ఓడితే అక్కడితో తమ ప్రయాణం ముగుస్తుంది.
