T20 World Cup: టీ20 ప్రపంచకప్ సూపర్–8 దశలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య రేపు కీలక మ్యాచ్ జరగనుంది. క్వార్టర్ ఫైనల్‌లాంటి పోరు రేపు కొనసాగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా, ఓడిన టీమ్ ఇంటికి వెళ్తుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతుంది. ఈసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. సాధారణంగా ఈ పిచ్ పై బౌలర్లకు హెల్ప్ లభిస్తుంటుంది. కానీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని క్యూరేటర్ సుజన్ ముఖర్జీ వెల్లడించారు.
పిచ్ పరిశీలించిన గంగూలీ:
భారత మాజీ కెప్టెన్, ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సీనియర్ క్యూరేటర్ ఆశిష్ బౌమిక్‌తో కలిసి ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్‌ను పరిశీలించారు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, అయితే క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే బౌలర్లకూ కొంత సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల లీగ్ దశలో జరిగిన స్కాట్లాండ్–ఇటలీ మ్యాచ్‌లో 200కి పైగా స్కోరు నమోదవడం కూడా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే సంకేతం ఇస్తోంది.
టాస్ కీలకం:
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ.. ఇక్కడ టాస్ కీలక పాత్ర పోషించనుంది. డ్యూ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 240+ పైగా స్కోరు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెస్టిండీస్ జట్టులో 9 నెంబర్ వరకు హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఉన్నారు. భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం వారికి ఉంది. కాబట్టి ప్రతి పరుగును జాగ్రత్తగా సాధించడం భారత్‌కు అత్యంత ముఖ్యం అని గంగూలీ సూచించారు. ఇక సెమీఫైనల్ అవకాశాలు ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఆధారపడి ఉండటంతో, ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.
