T20 World Cup: రేపే భారత్–వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై  పోరు.. కాళీమాతను దర్శించుకున్న గంభీర్

T20 World Cup: రేపే భారత్–వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై  పోరు.. కాళీమాతను దర్శించుకున్న గంభీర్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇవాళ (ఫిబ్రవరి 28న)  కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా కోల్‌కతాతో గంభీర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా రెండు టైటిళ్లు అందించిన ఆయన, 2024లో మెంటర్‌గా మరో టైటిల్ దక్కించుకున్నారు. ఆ విజయాలే అతడ్ని భారత జట్టు హెడ్ కోచ్ పదవికి తీసుకువచ్చాయి. రాహుల్ ద్రావిడ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన గంభీర్, ఇప్పుడు భారత జట్టుకు మరో ట్రోఫీ వైపు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వెస్టిండీస్ తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోగా, భారత్ జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. గెలిచిన జట్టు మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది. తమిళనాడులోని  చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ లతో టీమిండియా టోర్నీలోనే అత్యధికంగా 256 పరుగులు సాధించింది. ఈ ప్రదర్శనతో గంభీర్ కొంత రిలీఫ్ పొందినట్లే తెలుస్తుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ కీలక పోరులో భారత్ ఎలా రాణిస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

తాజాగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం ఉన్నప్పటికీ, టాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ డ్యూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువగా లేకపోవడంతో, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడం లేదా బ్యాటింగ్ చేయడం నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే, వెస్టిండీస్‌ ముందు గరిష్ట లక్ష్యం 240+ పరుగులు చేయాల్సి ఉంటుంది. వెస్టిండీస్ జట్టులో 9వ నంబర్ బ్యాటర్ వరకు హార్డ్ హిట్టర్లు ఉన్నారు. వీరు భారీ సిక్సర్లు కొట్టగలరు.