The Kerala Story 2 Review: ఒళ్లు జలదరించేలా చిత్రహింసలు.. ' ది కేరళ స్టోరీ 2' లో అసలు నిజమెంత?

The Kerala Story 2 Review: ఒళ్లు జలదరించేలా చిత్రహింసలు.. ' ది కేరళ స్టోరీ 2' లో అసలు నిజమెంత?

2023లో భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినప్పటికీ, తీవ్రమైన రాజకీయ, సామాజిక  విమర్శలకు దారితీసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (TKS2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందే కోర్టు కేసులు, స్టే ఆర్డర్లతో వార్తల్లో నిలిచింది. చిరరకు కోర్టు ఆదేశాలతో థియేటర్లలోకి వచ్చి మరోసారి చర్చకు తెరలేపింది.

కథా నేపథ్యం..

'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' మూవీ విడుదలపై ఉన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను శుక్రవారం ( ఫిబ్రవరి 27న)  కేరళ హైకోర్టు కోట్టివేసింది . దీంతో శనివారం ( ఫిబ్రవరి 28న ) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అయితే ఈ సారి  దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ గత చిత్రంలా కాకుండా తన పరిధిని కేరళకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించారు. కథ ముగ్గురు యువతుల చుట్టూ తిరుగుతుంది. 

కేరళకు చెందిన స్వతంత్ర భావాలు గల యువతి సురేఖ (ఉల్కా గుప్త). యూపీఎస్సీ సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆమె, జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్) మాయమాటల్లో పడి లివింగ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కన్జర్వేటివ్ కుటుంబానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్య (అదితి భాటియా). ఈమెను రషీద్ (యుక్తమ్ ఖోస్లా) అనే యువకుడు తన ప్రేమజాలంలో బంధిస్తాడు. గ్వాలియర్‌కు చెందిన జావెలెన్ త్రో ఛాంపియన్ నేహా (ఐశ్వర్య ఓజా). జాతీయ స్థాయికి వెళ్లాలనే ఆమె కలను ఆసరాగా చేసుకున్న రాజు అలియాస్ ఫైజన్ (అర్జన్ సింగ్), ఆమెను ట్రాప్ చేస్తాడు. ఈ ముగ్గురు యువతులు తమ లక్ష్యాలను వదిలి, ప్రేమించిన వారి కోసం ఇళ్లను వదిలి వెళ్లాక ఎదుర్కొన్న భయానక పరిస్థితులే ఈ సినిమా. 

ప్రోపగాండా వర్సెస్ వాస్తవం

సినిమా కేవలం వాస్తవ సంఘటనల ఆధారంగా తీశామని చెబుతున్నప్పటికీ, అది చూపే విధానం ఒక వర్గాన్ని పూర్తిగా విలన్లుగా చిత్రీకరించేలా ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలు, మలయాళీలు , మాంసాహారం (3 M's) మీద ఈ సినిమా దాడి చేస్తోందని, ఎటువంటి పరిశోధన లేకుండా కేవలం వీధిలో వినిపించే పుకార్లనే వాస్తవాలుగా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.. సినిమాలో సలీమ్ అనే పాత్ర ద్వారా "భారతదేశంలోని ప్రతి హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలి" అని చెప్పించడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇది సమాజంలో విద్వేషాన్ని పెంచేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన 'ప్రోపగాండా'గా అభివర్ణిస్తున్నారు.

ఎవరెవరు ఎలా చేశారంటే?

గతంలో సుదీప్ తో సేన్ అనుసరించిన 'టెంప్లేట్'నే దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ఇక్కడ కూడా అనుసరించారు. ప్రథమార్ధంలో అమ్మాయిలు ట్రాప్‌లో పడే విధానాన్ని కొంచెం నెమ్మదిగా చూపించినా, ద్వితీయార్థంలో చిత్రహింసలు, మత మార్పిడి ప్రయత్నాలు, అత్యాచార సన్నివేశాలను అత్యంత భీభత్సంగా (Graphic) చూపించారు. బాధిత యువతులుగా ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా అద్భుతమైన నటనను కనబరిచారు. విలన్ పాత్రల్లో సుమిత్, అర్జన్, యుక్తమ్ తమ క్రూరత్వాన్ని వెండితెరపై పండించడంలో సఫలమయ్యారు. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని తీవ్రతను పెంచింది.  సుకుమార్ అసోసియేట్ అయిన దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మేకింగ్‌లో వేగం చూపించినా, కొన్ని చోట్ల బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది.

సినిమాలోని వైరుధ్యాలు

సినిమాను విశ్లేషిస్తే కొన్ని లాజికల్ లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక అథ్లెట్ (నేహా) ఇంట్లో స్వామి వివేకానంద ఫోటో ఉంటుంది కానీ, ఆమె ఎప్పుడూ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు చూపించలేదు. అలాగే, ముగ్గురు యువతుల నేపథ్యాలు వేరైనా, వారు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్లను చిత్రహింసలు పెట్టిన తీరు అచ్చం ఒకేలా ఉండటం సినిమాను ఒక రొటీన్ ఫార్ములా వైపు నడిపించింది. క్లైమాక్స్‌లో 'బుల్డోజర్ న్యాయం' వంటి అంశాలను జోడించడం ద్వారా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారనిపిస్తుంది.

ఒక హెచ్చరికగా చూడాలా?

 సమతుల్యత పాటించే ప్రయత్నం చేసినప్పటికీ, సినిమా మొత్తం ఒకే వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. అయితే, నేటి 'జెన్-జీ' యువత తెలియక తీసుకుంటున్న నిర్ణయాలు, సోషల్ మీడియా ట్రాప్‌లు, అపరిచితులను నమ్మి మోసపోవడం వంటి అంశాలను ఒక హెచ్చరికగా చూడవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళతో సంబంధం లేని కథలను కూడా 'కేరళ స్టోరీ' అనే టైటిల్‌తో ప్రమోట్ చేయడం కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసమే అన్నది స్పష్టంగా తెలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.