V6 News

మిల్కీ బ్యూటీ తమన్నాకి భారీ షాక్..15 ఏళ్ల 'సోప్ వార్'కు మద్రాస్ హైకోర్టు ఫుల్ స్టాప్!

మిల్కీ బ్యూటీ తమన్నాకి భారీ షాక్..15 ఏళ్ల 'సోప్ వార్'కు మద్రాస్ హైకోర్టు ఫుల్ స్టాప్!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. దాదాపు 15 ఏళ్లుగా సాగుతున్న ఒక పాత వివాదానికి న్యాయస్థానం ఫుల్ స్టాప్ పెట్టింది . కోటి రూపాయల నష్టపరిహారం కావాలంటూ ఆమె వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆమె సమర్పించిన ఆధారాలు సరిగ్గా లేవని హైకోర్టు తేల్చిచెప్పింది.  దీంతో ఆమె 15 ఏళ్ల న్యాయపోరాటానికి నిరాశను మిగిల్చింది.

వివాదం ఎక్కడ మొదలైంది?

అసలు ఈ ‘సోప్ వార్’ 2008లో మొదలైంది. అప్పట్లో తమన్నా ఎదుగుతున్న స్టార్. ‘పవర్ సోప్స్ లిమిటెడ్’ అనే సంస్థ తమ సబ్బుల ప్రచారానికి తమన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ఏడాది పాటు ( అక్టోబర్ 2008 నుండి అక్టోబర్ 2009 వరకు) ఆమె ఫోటోలను వాడుకోవచ్చని అగ్రిమెంట్ జరిగింది. అయితే ఒప్పందం గడువు ముగిసిన తర్వాత కూడా సదరు కంపెనీ తన ఫోటోలను సబ్బు రేపర్లపై, ప్రకటనల్లో , ఆన్‌లైన్‌లో యథేచ్ఛగా వాడుతోందని ఆరోపిస్తూ తమన్నా కోర్టు ఆశ్రయించారు.

కోటి రూపాయల క్లెయిమ్..

కానీ 2010 నుంచి- 2011 వరకు కూడా తన ఫోటోలు వాడుతుండటం వల్ల తన వృత్తిపరమైన అవకాశాలు దెబ్బతిన్నాయని తమన్నా వాదించారు. ఆ సమయంలో ఆమె ఇతర పెద్ద బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నారని, పాత బ్రాండ్ ఇంకా ఆమె ముఖాన్ని వాడుతుండటం వల్ల కొత్త డీల్స్ కుదరలేదని ఆమె తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీనివల్ల తనకు జరిగిన నష్టానికి గాను రూ.1 కోటి పరిహారం చెల్లించాలని, అలాగే తన ఫోటోలను వాడకుండా శాశ్వత నిషేధం విధించాలని ఆమె కోర్టును కోరారు..

►ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి సస్పెన్స్‌తో కట్టిపడేసే క్రైమ్ థ్రిల్లర్.. వరుస హత్యలు, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్

కోర్టులో ఏం జరిగిందంటే?

ఈ కేసు తొలుత మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ముందుకు వచ్చింది. తమన్నా తన వాదనకు మద్దతుగా కొన్ని సబ్బు రేపర్లను, కొనుగోలు రశీదులను , ఇంటర్నెట్ స్క్రీన్ షాట్లను సమర్పించారు. అయితే, ఆ సబ్బులు ఒప్పందం ముగిసిన తర్వాతే మార్కెట్లోకి వచ్చాయని నిరూపించడంలో విఫలమయ్యాయి. ఆమె సమర్పించిన రశీదులు, వెబ్‌సైట్ లింకులు సదరు కంపెనీకి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు నిరూపించలేకపోయారు. సబ్బు రేపర్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలు ఒప్పందం తర్వాతవేనని స్పష్టమైన ఆధారాలు లేవని జడ్జి అభిప్రాయపడ్డారు. దీంతో సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా, తమన్నాకు జరిమానా కూడా విధించారు.

తుది తీర్పు..

అయితే  సింగిల్ బెంచ్ తీర్పుపై ఆమె డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేశారు.  జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని డివిజన్ బెంచ్‌  స్పష్టం చేసింది.. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత ఫోటోలు వాడారనే విషయానికి బలమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ, తమన్నా అభ్యర్థనను తోసిపుచ్చారు.  దీంతో పదేళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటం తమన్నాకు నిరాశనే మిగిల్చింది.