రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తెలంగాణ విద్యా కమిషన్ కీలక మార్పులను సూచించింది. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి అందించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌లో టీచర్ల నియామకాలు, సర్వీసు నిబంధనలపై పలు ప్రతిపాదనలు చేసింది. ఇకపై టీచర్ల ఉద్యోగం శాశ్వతం కాదని, వారి పనితీరు బాగుంటేనే సర్వీసులో కొనసాగించాలని కమిషన్ స్పష్టం చేసింది.
బదిలీలు బంద్.. ఉండాల్సింది అక్కడే
మండలమే యూనిట్‌గా రిక్రూట్‌మెంట్ జరపాలని, టీచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీలు (హెల్త్ గ్రౌండ్స్‌లో కూడా) ఉండకూడదని కమిషన్ సూచించిది. టీచర్లు తాము పనిచేసే గ్రామంలో లేదా మండల కేంద్రంలోనే (15 కి.మీ పరిధిలో) నివాసం ఉండడం తప్పనిసరని పేర్కొంది. విధుల్లో చేరే ముందే దీనిపై అండర్‌టేకింగ్ తీసుకోవాలని పేర్కొంది. ప్రమోషన్ల విషయంలోనూ ఆటోమేటిక్ పద్ధతికి చెక్ పెట్టింది.
ప్రైమరీ టీచర్లు హైస్కూల్ పోస్టులకు వెళ్లాలంటే మళ్లీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారానే రావాలని, వారికి 10 శాతం వెయిటేజీ మాత్రమే ఉంటుందని పేర్కొంది. మరోపక్క టీచర్ పోస్టుల పేర్లను కూడా మార్చబోతున్నారు. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, సీనియర్ సెకండరీ టీచర్లుగా పిలుస్తారు. హైస్కూల్ టీచర్‌కు పీజీతో పాటు రెండేళ్ల ట్రైనింగ్, ప్రైమరీ టీచర్‌కు డిగ్రీతో పాటు రెండేళ్ల ట్రైనింగ్ తప్పనిసరి అని స్పష్టంచేసింది.
జీతాల రేషనలైజేషన్.. బయోమెట్రిక్‌తోనే సాలరీ
ప్రస్తుతం టీచర్లు, సిబ్బందికి ఇస్తున్న జీతాలు మార్కెట్ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో చేసే నియామకాల్లో జీతాల నిర్మాణాన్ని మార్కెట్ బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా మార్చాలని సూచించింది. తద్వారా విద్యలో నాణ్యత పెంచే ఇతర ఖర్చులకు బడ్జెట్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాగా, ప్రతినెలా 1వ తారీఖునే జీతాలు చెల్లించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే సెలవులు, జీతాల మేనేజ్‌మెంట్ ఉండాలని స్పష్టం చేసింది.
