కోలీవుడ్ నుంచి వచ్చి సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కుర్రాడు ప్రదీప్ రంగనాథన్. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన ప్రతిభతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యంగ్ హీరో పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ప్రదీప్.. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ఊహించని స్థాయిలో పెంచేశారు.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టార్‌డమ్ వరకు!
ప్రదీప్ ప్రయాణం ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే మొదలైంది. 'వాట్సాప్ కాదల్' అనే లఘు చిత్రంతో నటన, దర్శకత్వం, ఎడిటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో తన మార్క్ చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ కసి, కృషితోనే 'కోమలి' చిత్రంతో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేసి, హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
'లవ్ టుడే'తో గ్లోబల్ రీచ్
దర్శకుడిగా సక్సెస్ అయ్యాక, తనలోని నటుడిని బయటకు తీస్తూ ప్రదీప్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'లవ్ టుడే'. నేటి తరం యూత్ పల్స్‌ను పక్కాగా పట్టుకుని ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ తర్వాత వచ్చిన 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్', 'డ్యూడ్' వంటి సినిమాలు అతడిని స్టార్ హీరోల సరసన నిలబెట్టాయి.
50 లక్షల నుంచి 25 కోట్ల వైపు..
ప్రదీప్ ఎదుగుదల గ్రాఫ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తన మొదటి సినిమా 'కోమలి'కి కేవలం 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఈ కుర్ర హీరో, ఇప్పుడు ఏకంగా 25 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరాడు. బడా బ్యానర్లు సైతం ప్రదీప్ కాల్ షీట్ల కోసం క్యూ కడుతున్నాయంటే అతడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK)
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రదీప్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య కీలక పాత్రలో మెరవనున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మార్చిలో విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రదీప్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
