అమెరికా వ్యూహం మిస్సైల్స్ - ఇజ్రాయెల్ టార్గెట్ నేతలు: ఇరాన్ ఉక్కిరిబిక్కిరి

అమెరికా వ్యూహం మిస్సైల్స్ - ఇజ్రాయెల్ టార్గెట్ నేతలు: ఇరాన్ ఉక్కిరిబిక్కిరి

అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇరాన్ అణు క్షిపణి సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని శనివారం తెల్లవారుజామున అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ', ఇజ్రాయెల్ 'ఆపరేషన్ లయన్స్ రోర్' పేరుతో భారీ దాడులు మెుదలుపెట్టాయి. దీనికి సంబంధించిన వార్ ప్లాన్ గురించి ఒక సీనియర్ అమెరికన్ అధికారి కీలక వివరాలు వెల్లడించారు. అమెరికా తన దాడులను ప్రధానంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, తయారీ కేంద్రాలపై కేంద్రీకరిస్తుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ టాప్ లీడర్లను అంతమొందించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ధృవీకరిస్తూ.. ఇరాన్ క్షిపణి తయారీని పూర్తిగా తుడిచిపెడతామని హెచ్చరించారు. అమెరికా బలగాలు ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాలు, భూగర్భ లాంచర్లు, నౌకాదళ స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ తన మిసైళ్లతో అమెరికా మిత్రదేశాలకు ముప్పు కలిగించకుండా చేయడమే పెంటాగన్ ప్రధాన ఉద్దేశం. ఈ దాడుల్లో సముద్రం నుంచి ప్రయోగించే టోమాహాక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా వినియోగిస్తోంది.

మరోవైపు ఇజ్రాయెల్ దాడుల శైలి భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం, నివాసం, ఇరాన్ అధ్యక్ష భవనం సమీపంలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపడుతోందని సమాచారం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ కమాండర్లను, కీలక రాజకీయ నాయకులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ మొసాద్ సహకారంతో వ్యూహాత్మక దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని దెబ్బతీయడం ద్వారా ఆ దేశ పాలనను అస్థిరపరచాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ సహా ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవ్వడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించబడింది. అమెరికా ఇజ్రాయెల్ మధ్య మునుపెన్నడూ లేనంత సమన్వయంతో జరుగుతున్న ఈ దాడులు మధ్యప్రాచాన్ని మార్చేసేలా కనిపిస్తున్నాయి.