సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR).. హైదరాబాద్, అనకాపల్లి మధ్య మరో మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి అనకాపల్లి వెళతాయని.. అనకాపల్లి నుంచి చర్లపల్లికి చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
* ట్రైన్ నెంబర్ 07479 అనకాపల్లి-చర్లపల్లి.. జనవరి 18న రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు (జనవరి 19న) ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
* ట్రైన్ నెంబర్ 07477 చర్లపల్లి-అనకాపల్లి.. జనవరి 19న 12.40 amకు చర్లపల్లి నుంచి బయలుదేరి అదే రోజు (జనవరి 19న) రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.
* ఇక మూడో రైలు.. ట్రైన్ నెంబర్ 07478 జనవరి 19న రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు (జనవరి 20) ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఇవి మాత్రమే కాదు.. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రైన్ నెంబర్.07475 రైలు హైదరాబాద్ నుంచి విజయవాడకు 11, 12, 13, 18, 19 తేదీల్లో వెళుతుంది.
ట్రైన్ నెంబర్.07476 రైలు.. విజయవాడ నుంచి హైదరాబాద్కు 10,11,12,17,19 తేదీల్లో వెళుతుందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అంతేకాదు.. 11, 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్కు (ట్రైన్ నెంబర్.07473), 10, 11 తేదీల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్కు ((ట్రైన్ నెంబర్.07474) రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఘన్ పూర్, కాజీపేట్, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే స్పెషల్ ట్రైన్ కూడా ఇవే రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
