ఏప్రిల్ 1 నుంచి దొరికేది E– 20 పెట్రోల్ మాత్రమే.. పాపం.. 2023కు ముందు తయారైన బండ్ల పరిస్థితి ఏంటో..?

ఏప్రిల్ 1 నుంచి దొరికేది E– 20 పెట్రోల్ మాత్రమే.. పాపం.. 2023కు ముందు తయారైన బండ్ల పరిస్థితి ఏంటో..?

భారతదేశంలో పెట్రోల్ వాహనాల అధికారిక జీవిత కాలం 15 సంవత్సరాలు. కానీ, E–20  వాహనాల అమ్మకానికి 2023లో కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. 2011 నుంచి 2023 వరకు 250 మిలియన్లకుపైగా వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 234 మిలియన్లు పెట్రోల్ వాహనాలు. అంటే ఈ వాహనాల్లో ఏవీ E–20 ఇంధనానికి సిద్ధంగా లేవు. ఈ  234 మిలియన్ వాహనాలు రిస్కులో ఉన్నాయి. వాటికి మైలేజీ 3 నుంచి 7% తగ్గుతుంది. వాహనంలోని కొన్ని రబ్బరు,  ప్లాస్టిక్ భాగాలు వేగంగా అరిగిపోవడం, చిరిగిపోవడం వంటివి జరగవచ్చును. అంతేకాకుండా ఇతర ఇంజిన్ భాగాలు దెబ్బతినవచ్చు. ఈ డ్యామేజ్కు  ఎవరు బాధ్యత వహిస్తారు ?

E– 20  పెట్రోలుకు అనుకూలంగా లేని పాత వాహనాలలో  E–20 పెట్రోల్  వాడడంవలన జరిగే  నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు,  ప్రభుత్వం బాధ్యత  వహించదు. ఈ  విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే స్పష్టంగా చెప్పాయి.  గత  ఏడాది కస్టమర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించి  E–20 పెట్రోల్ అమలును  కొన్ని రోజులుపాటు ఆపమని  కోరారు.  కానీ,  సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇది అతి పెద్ద సమస్య. E–20  ఇంధనం  మినిమమ్ 95 రీసెర్చ్ ఆక్టేన్  నెంబర్ (95 RON) కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేసింది. రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్, సాధారణంగా వాడే ఆక్టేన్ నెంబర్  రెండూ ఒక్కటే.

2026, ఏప్రిల్ 1 నుంచి భారతదేశ ఇంధన స్టేషన్లలో  E–20  పెట్రోల్ మాతమే దొరుకుతుంది. ప్రస్తుతం వాడుతున్న సాధారణ పెట్రోల్ (100%పెట్రోలు) ఇకపై లభించదు. E–20 పెట్రోల్  అంటే  20%  ఇథైల్ ఆల్కహాల్ + 80% పెట్రోల్  కలిసి ఉన్న ఒక బ్లెండెడ్ పెట్రోల్.  E-20 పెట్రోల్​కు కావలసినది  ఇథైల్ ఆల్కహాల్.  ఇది ఒక పునరుత్పాదక జీవ ఇంధనం. ఇథైల్ ఆల్కహాల్​ను ఆహార ధాన్యాలను  పులియపెట్టడం  ద్వారా  తయారు చేస్తారు.

మొక్కజొన్న తక్కువ నీటితో పండుతుంది, విరివిగా లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది.  కాబట్టి మొక్కజొన్న  నుంచి ఇథైల్ ఆల్కహాల్​ను ఎక్కువ మొత్తంలో లాభసాటిగా తయారు చేయవచ్చు.  ఇథైల్ ఆల్కహాల్​ను చెరుకు నుంచి కూడా తయారు చేస్తారు.  చెరుకుసాగు అధిక మొత్తంలో నీటిని వినియోగించుకోవడం వలన భూగర్భ జలాలు క్షీణిస్తాయి.  కాబట్టి  ఇథైల్ ఆల్కహాల్​ను ఇతర పదార్థాల నుంచి తయారుచేస్తున్నారు.