భారత్కు గ్యాస్ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్

భారత్కు గ్యాస్ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్

భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్​ సరఫరాను ఆపుతున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత పరిశ్రమలకు సరఫరా అయ్యే గ్యాస్​లో 40 శాతం వరకు కోత పడింది. 

భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల లిక్విఫైడ్​ నేచురల్​గ్యాస్​(ఎల్ఎన్​జీ)లో ఖతర్ వాటా 40 శాతం  ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్​జీ పంపిణీ వంటి కీలక రంగాలకు ఇది ఎంతో అవసరం.   ఎల్ఎన్​జీ ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రో నెట్ ఎల్ఎన్​జీ.. మనదేశ గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు తెలియజేసింది.

గ్యాస్ విక్రయ సంస్థలు సీఎన్​జీ అమ్మకాలను కొనసాగిస్తూనే పరిశ్రమలకు ఇచ్చే సరఫరాలో 10 నుంచి 40 శాతం వరకు కోత విధించాయి. పెట్రోనెట్ సంస్థ ఖతార్ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్ఎన్​జీ కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు స్పాట్ మార్కెట్ నుంచి కూడా అదనంగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది. 

గ్యాస్ కొరతను అధిగమించేందుకు గెయిల్, ఐఓసీ సంస్థలు ప్రస్తుతం స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి.  అక్కడా ధరలు భారీగా పెరిగాయి.  ఎల్ఎన్​జీ ధర ప్రస్తుతం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్​కు 25 డాలర్లకు చేరింది. ఇది సాధారణ ధరల కంటే దాదాపు రెట్టింపు.