బెంగళూరులో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో అనుమానాస్పద మృతి చివరికి దారుణమైన హత్యగా తేలింది. బెంగళూరులో ఉండే 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షర్మిల కుశాలప్పను ఆమె పక్కింట్లో ఉండే ఓ విద్యార్థి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే... మంగళూరుకు చెందిన షర్మిల, యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తూ రామమూర్తినగర్‌లో ఒంటరిగా ఉంటుంది. జనవరి 3వ తేదీ రాత్రి ఆమె ఫ్లాట్ నుండి పొగ వస్తుండటంతో ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పిన తర్వాత షర్మిల అపస్మారక స్థితిలో వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. మొదట అందరూ పొగ పీల్చడం వల్లే ఆమె చనిపోయిందని అనుకున్నారు.
కానీ షర్మిల మృతిపై ఆమె స్నేహితుడు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు పోస్ట్‌మార్టం చేయించారు. దింతో రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మంటలు అంటుకోకముందే ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, ఆమెను గొంతు పిసికి చంపారని డాక్టర్లు చెప్పారు. దింతో విచారించగా షర్మిల ఉంటున్న భవనంలోనే పక్క ఫ్లాట్‌లో తన తల్లితో కలిసి ఉండే 19 ఏళ్ల కర్నాల్ అనే విద్యార్థిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు.
సంఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటలకు కర్నాల్ కిటికీ ద్వారా షర్మిల ఫ్లాట్‌లోకి వెళ్లి ఆమె పై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు ఆమె ముక్కు, నోరు గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని తెలిసాక సాక్ష్యాలు దొరక్కుండా ఆమె బట్టలకు నిప్పు పెట్టి అదే కిటికీ నుండి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
