కువైట్ బేస్ పై దాడి.. ఆరుకు చేరిన సోల్జర్ల మరణాలు

కువైట్ బేస్ పై దాడి.. ఆరుకు చేరిన సోల్జర్ల మరణాలు

వాషింగ్టన్: కువైట్ లో అమెరికా బేస్ పై ఇరాన్ దాడిలో మరణించిన సోల్జర్ల సంఖ్య ఆరుకు చేరింది. ఈ విషయాన్ని యూఎస్  సెంట్రల్ కమాండ్  ధ్రువీకరించింది. మిసైల్ అటాక్ జరిగినపుడు ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. గాయపడ్డ సైనికుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించామని తెలిపింది. సోమవారం ఆ సైనికుడు కూడా చనిపోయాడని పేర్కొంది. పేలుడు జరిగిన ప్రాంతంలో మరో ఇద్దరు సైనికుల మృతదేహాలను వెలికి తీశామని చెప్పింది. 

కువైట్ లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్  ప్రయోగించిన క్షిపణిని తమ ఎయిర్ డిఫెన్స్  సిస్టమ్  అడ్డుకోలేకపోయిందని, దీంతో బంకర్  ధ్వంసమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్  హెగ్ సేత్  తెలిపారు. ఇరాన్  చాలా శక్తివంతమైన ఆయుధం ప్రయోగించిందని, నలువైపులా రక్షణ గోడలు ఉన్నా క్షిపణి దూసుకువచ్చిందని ఆయన వివరించారు. కాగా.. ధ్వంసమైన బంకర్ స్థానంలో ప్రస్తుతం తాత్కాలికంగా మరో బంకర్  నిర్మిస్తున్నామని అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు.