నటాంజ్‌‌ అణుకేంద్రంపై దాడి

నటాంజ్‌‌ అణుకేంద్రంపై దాడి
  • న్యూక్లియర్‌‌‌‌ ఫెసిలిటీ కాంప్లెక్స్‌‌లో తీవ్రంగా దెబ్బతిన్న పలు భవనాలు 

టెహ్రాన్: ఇరాన్‌‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌‌లో ఉన్న అత్యంత కీలకమైన నటాంజ్ అణుకేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు నిర్వహించాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ ఒప్పందాలను పక్కనపెట్టి ఇరాన్ వేగంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. 

ఈ దాడుల్లో నటాంజ్‌‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌‌ చిత్రాలు రిలీజ్‌‌ అయ్యాయి.  తాజా దాడుల్లో న్యూక్లియర్‌‌‌‌ ఫెసిలిటీ కాంప్లెక్స్‌‌లోని  పలు భవనాలు దెబ్బతిన్నట్టు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నెల 1, 2న జరిగిన దాడులకు సంబంధించి '‘వాంటర్’ అనే సంస్థ ఈ శాటిలైట్‌‌ చిత్రాలను తీసింది.

భవనాలకు నష్టం

ఈ నెల 2న తీసిన ఫొటోలో ఈ కేంద్రం లోపల ఉన్న కనీసం రెండు చిన్న భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నది.  ఈ నెల 1న తీసిన చిత్రాల్లో ఇవి డ్యామేజ్‌‌ కానట్టుగా ఉన్నది. ఈ కేంద్రంపై ఆదివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్, అమెరికా కలిసి రెండుసార్లు దాడులు చేశాయని ఇరాన్ అణు ఇంధన విభాగం చీఫ్ మొహమ్మద్ ఇస్లామీ ఆరోపించారు. 

ఈమేరకు ఆయన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కు లేఖ రాశారు. అయితే, తొలుత అక్కడ  ఎలాంటి అణు సంస్థలు దెబ్బతిన్నట్లు తమకు  ఆధారాలు లేవని  యూఎన్‌‌ అణు విభాగం అధిపతి చెప్పారు. తర్వాత కొంత నష్టం జరిగినట్లు ఆ తర్వాత ధ్రువీకరించారు.