- వాస్తవాలను ప్రజల ముందుంచండి
- గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు
- అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు
- కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతున్నదని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: 2014 లో మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, 27 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పుల పాలు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనికితోడు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించడానికి అప్పులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పులు, రైతు భరోసా నిధులకు అప్పులు, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు... ఇలా చెప్పుకుంటూ పోతే అప్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి తెలంగాణలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల మాదిరిగా కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకుంటున్నా, రాష్ట్రం చేపట్టే పథకాలకు కూడా కేంద్రం అందిస్తున్న వడ్డీ రహిత రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతున్నదని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం..
అసెంబ్లీ ఎన్నికల వేల ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే.. రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కానీ.. ఇటీవల సోనియా గాంధీ, -రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించడం ఏంటని లేఖలో ప్రశ్నించారు. ఈ విధానం చూస్తుంటే... ‘రాష్ట్ర ఖజానా నిల్–కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్’ అన్న చందంగా ఉందన్నారు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూనే ఉందని చెప్పారు.
ఈ దిశలో ప్రస్తుతం కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించి ఎంఎటీఎస్ ఫేజ్ – II కు రూ.200 కోట్లు, మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ స్కీమ్‌కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ్ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్దిపేట బైపాస్ రోడ్డుకు రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లులాంటి ప్రాజెక్టులు ఉన్నాయని వివరించా రు.
12 ఏండ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లిచ్చినం..
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తున్నదని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘‘పలు పథకాలు, వివిధ రూపాల్లో గత 12 ఏండ్లలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36 వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50 వేల కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40 వేల కోట్లకు పైగా ఫండ్స్, రూ.12 వేల కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14 వేల కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఫండ్స్, విద్య, క్రీడలకు రూ.21వేల కోట్లు, దాదాపు రూ.9 వేల కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు ఉన్నాయి” అని తెలిపారు. అలాగే, రైతులకు కనీస మద్దతు ధర కింద దాదాపు 3 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల రుణాలు అందాయని వివరించారు.
పెట్రో ఉత్పత్తులపై ఆందోళన వద్దు
న్యూఢిల్లీ, వెలుగు: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పెట్రోఉత్పత్తుల లభ్యతపై దేశ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంతో పాటు క్రూడ్ ఆయిల్ నిల్వలు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఎగుమతి, దిగుమతులను పర్యవేక్షించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ, షిప్పింగ్, పెట్రోలియం, ట్యాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాలతో కలిసి ఒక హై-లెవల్ టీమ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఇంధన సరఫరాను నిరంతరం మానిటర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళూరు, పాదూర్, విశాఖపట్నంలో వ్యూహాత్మక ఇంధన నిల్వలను పెంచుకోవడంతో పాటు, దేశీయ ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. గతంలో కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నదని వివరించారు.
