కొత్త కార్పొరేషన్లలో 2 వేల ఉద్యోగాలు

కొత్త కార్పొరేషన్లలో 2 వేల ఉద్యోగాలు
  • ఎంత మంది కావాలో లెక్కలు తీస్తున్న అధికారులు 
  • త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు  
  • అనుమతులు రాగానే ఔట్​సోర్సింగ్​లో నియామకం  

హైదరాబాద్ సిటీ, వెలుగు: విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఖాళీలను నింపడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతకుముందు లోకల్ బాడీల ఉద్యోగులున్నా సరిపోక జీహెచ్ఎంసీ నుంచి 603 మందిని కేటాయించారు. దీంతో జీహెచ్ఎంసీలోనూ స్టాఫ్​అవసరం ఏర్పడింది. కొన్ని విభాగాల్లో అటెండర్లు కూడా లేరు. దీంతో అధికారులు ఏ కార్పొరేషన్​లోని ఏ విభాగానికి ఎంతమంది సిబ్బంది అవసరం? ఏ స్థాయి అధికారులు కావాలన్న లెక్కలు తీస్తున్నారు. ఇప్పటివరకు రెండు కొత్త కార్పొరేషన్లలో కలిపి దాదాపు 2 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరముంటుందనే అంచనాకు వచ్చారు.

ముఖ్యంగా శానిటేషన్, హెల్త్, స్పోర్ట్స్, అర్భన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్(యూసీడీ), వెటర్నరీ విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ విభాగాల్లో సిబ్బంది సరిపడా ఉంటే ముఖ్యమైన సమస్యలను తొందరగా పరిష్కరించవచ్చని, అందుకే ఒక్కో విభాగానికి  200 చొప్పున ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉంటుందనే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్స్, అటెండెంట్లు, శానిటేషన్ వర్కర్లు, ఇతర సహాయక సిబ్బంది వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ప్రపోజల్స్​ను ప్రభుత్వానికి పంపి అనుమతులు రాగానే నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.  భర్తీకి సంబంధించి ఈ నెలలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ట్రై కార్పొరేషన్లలో మరోసారి మార్పులు

మూడు కార్పొరేషన్లు ఏర్పడిన టైంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వారిలో కొందరిని ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా ఏఎంసీ, సీఎంసీలకు బదిలీ చేశారు. దీంతో తమ సమాచారం లేకుండానే బదిలీ చేశారని, ఉంటున్న ఇండ్ల నుంచి ఆఫీసులు దూరమవుతున్నాయని ఉద్యోగులు, సిబ్బంది జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్​దృష్టికి తీసుకువెళ్లారు. పలు యూనియన్లు జేఏసీగా ఏర్పడి పాత చోటే అవకాశం కల్పించాలని కోరాయి. కొత్త కార్పొరేషన్లలో సిబ్బందిని తీసుకుంటున్న తరుణంలో ఉద్యోగులు, సిబ్బంది బదిలీలపై మరోసారి ఆప్షన్​ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ముందుగా అనారోగ్య సమస్యలున్నవారికి ప్రయార్టీ ఇవ్వనున్నారు.