అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌ ను వరల్డ్ హెరిటేజ్ సైట్’గా తీర్చిదిద్దుతాం

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌ ను వరల్డ్ హెరిటేజ్ సైట్’గా తీర్చిదిద్దుతాం
  • డీఎఫ్ఓ రేవంత్ చంద్ర

అచ్చంపేట, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌ ను పర్యావరణహితంగా అభివృద్ధి చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ‘మిక్స్‌‌‌‌ డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్’గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి  రేవంత్ చంద్ర తెలిపారు. మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘రంగ్- ఏ- అరణ్య’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, సుమారు 500 మంది విద్యార్థులకు ప్రకృతిలోని సహజ వర్ణాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌‌‌‌కు సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ ఎకో-టూరిజం కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని, అటవీ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న చెంచు గిరిజనులకు పర్యాటకం ద్వారా జీవనోపాధి మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అటవీ హక్కుల చట్టం స్టేజ్-2 అనుమతుల ద్వారా కోర్ ఏరియాలోని ఐదు గ్రామాలకు పునరావాసం కల్పించడం వల్ల సుమారు 4 వేల ఎకరాల భూభాగం పులుల సంరక్షణకు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఔషధ మొక్కలు, అపార వన్యప్రాణి సంపద, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభిస్తే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గౌరవం లభిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.