హార్మూజ్ జలసంధి క్లోజ్..నిలిచిపోయిన 700 ట్యాంకర్లు

హార్మూజ్ జలసంధి క్లోజ్..నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
  • చిక్కుకుపోయిన వాటిలో 27 భారతీయ నౌకలు
  • వాటిలో10 వేల కోట్ల విలువైన సరుకు

న్యూఢిల్లీ: ఇరాన్​పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం ఆ జలసంధిలో 706 ట్యాంకర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. హార్మూజ్ జలసంధి దాటేందుకు ప్రయత్నించే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ఇదివరకే హెచ్చరించింది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ చిక్కుకున్నాయి. 

ఈ నెల 1న 2.8 మిలియన్  బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న మూడు నౌకలు మాత్రమే హార్మూజ్ జలసంధిని దాటాయి. ఆ నౌకలపై మిసైళ్లతో ఇరాన్ దాడికి యత్నించినా అవి త్రుటిలో తప్పించుకున్నాయి. ఇక చిక్కుకుపోయిన 706 ట్యాంకర్లలో 334 క్రూడ్  క్యారియర్లు, 109 డర్టీ ప్రాడక్ట్  ట్యాంకర్లు, 263 క్లీన్  ప్రాడక్ట్  వెసెల్స్ ఉన్నాయి. ఈ ట్యాంకర్లలో మన దేశానికి చెందినవి ఏడు నౌకలు ఉన్నాయి. అలాగే, గల్ఫ్  ఆఫ్ ఒమన్ లో వందలకొద్దీ ట్యాంకర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ జలసంధిని ఇరాన్  దిగ్బంధించడంతో భారత్, చైనాపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశానికి చమురు రవాణా అత్యధికంగా హార్మూజ్  జలసంధి ద్వారానే జరుగుతుంది.

పరిస్థితిపై కేంద్రం సమీక్ష

హార్మూజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితిపై కేంద్రం మంగళవారం సమీక్ష నిర్వహించింది. అక్కడ చిక్కుకున్న 27 నౌకలను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రప్పించాలని పోర్ట్స్, షిప్పింగ్, జలరవాణా శాఖకు ఇండియన్ నేషనల్  షిప్ ఓనర్స్ అసోసియేషన్(ఐఎన్ఎస్ఏ) లేఖ రాసింది. ఆ 27 నౌకల్లో మొత్తం రూ.10 వేల కోట్ల సరుకు ఉందని తెలిపింది. 

‘‘అ జలసంధి ద్వారానే మన దేశానికి 40% చమురు, 50% లిక్విఫైడ్  నేచురల్ గ్యాస్  రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆ నౌకలను స్వదేశానికి తీసుకురండి” అని షిప్  ఓనర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ జలసంధిలో మన దేశానికి చెందిన ఓ నౌకపై ఇరాన్  దాడిచేసే ప్రయత్నం చేయగా.. త్రుటిలో తప్పించుకుందని వెల్లడించారు.