మీ చావు మీరు చావండి.. ఇప్పుడు పంపించటం అంటే సాధ్యం కాదు: యూఎస్ ఎంబసీ

మీ చావు మీరు చావండి.. ఇప్పుడు పంపించటం అంటే సాధ్యం కాదు: యూఎస్ ఎంబసీ

ఇజ్రాయెల్‌లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. తమ పౌరులను కాపాడుకోవడంలో ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. సాధారణంగా విదేశాల్లో తమ పౌరులకు ఆపద వస్తే ప్రత్యేక విమానాలు పంపి తరలించే అమెరికా.. ఈసారి మాత్రం చేతులెత్తేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ నుంచి అమెరికన్లను స్వయంగా తరలించే స్థితిలో తాము లేమని యూఎస్ ఎంబసీ స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

మీ దారి మీరు చూసుకోండి
అమెరికా ఎంబసీ విడుదల చేసిన తాజా అడ్వైజరీ ప్రకారం.. "ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వీడాలనుకునే అమెరికన్లకు మేము నేరుగా ఎటువంటి సహాయం చేయలేము. పౌరులు తమ సొంత భద్రతా ప్రణాళికలను తామే రూపొందించుకోవాలి" అని తేల్చి చెప్పేసింది. యుద్ధం ముదురుతున్న సమయంలో తమ సొంత దేశం నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో ఇజ్రాయెల్‌లో ఉన్న వేలాది మంది అమెరికన్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అల్టర్నేటివ్ మార్గాలపైనే భారం
అమెరికా ప్రభుత్వం నేరుగా సహాయం చేయకపోయినా.. ఇజ్రాయెల్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన షటిల్ సర్వీసుల సమాచారాన్ని మాత్రం షేర్ చేస్తోంది. మార్చి 2 నుంచి 'తబా బోర్డర్' వరకు ఇజ్రాయెల్ అధికారులు ప్రత్యేక వాహనాలను నడుపుతున్నారు. అమెరికన్లు ఎవరైనా వెళ్లాలనుకుంటే ఇజ్రాయెల్ ఎవాక్యుయేషన్ ఫామ్ నింపి ఈ సేవలను వాడుకోవచ్చని సూచించింది. అయితే ఇక్కడే అమెరికా మరో ట్విస్ట్ ఇచ్చింది.

భద్రతకు గ్యారెంటీ లేదు
ఇజ్రాయెల్ ప్రభుత్వం నడుపుతున్న ఈ షటిల్ సర్వీసులను ఉపయోగించుకోవాలని తాము సిఫార్సు చేయడం లేదని, అలాగని వద్దు అని కూడా చెప్పడం లేదని ఎంబసీ పేర్కొంది. ఒకవేళ మీరు ఈ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే.. మీ సేఫ్టీకి అమెరికా ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వదు అని కుండబద్ధలు కొట్టింది. అంటే యుద్ధ భూమి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే అది పూర్తిగా పౌరుల వ్యక్తిగత బాధ్యతే అంటూ అమెరికా స్పష్టం చేసింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇటు ఇజ్రాయెల్‌లోనూ, అటు అమెరికాలోనూ కలకలం రేపుతోంది. తమ దేశ పౌరులను రక్షించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.