- వారానికోసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేయాలి.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే
- ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి
- లేదంటే కలెక్టర్, ఎస్పీ.. ఇద్దరినీ సస్పెండ్ చేస్త
- ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- పంపుసెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి
- మిల్లర్ల మెడలు వంచైనా..రూ. 3,900 కోట్లు కక్కించండి
- అధికారుల పనితీరును గమనిస్తున్నం.. జూన్‌లో ప్రోగ్రెస్ రిపోర్ట్
- పనితీరు ఆధారంగానే అవార్డులు, రివార్డులు.. మరోసారి సమీక్షిస్తామని వెల్లడి
- సెక్రటేరియెట్‌లో కలెక్టర్లతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: కలెక్టర్లు పల్లెబాట పట్టాలని, నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.‘‘వారానికోసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడండి. ఆసుపత్రుల్లో రోగులను కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోండి.. రైతులను కలిసి అధునాతన సాగుపద్ధతులను వివరించండి.. సోలార్ పంపుసెట్లు ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించండి’’ అని సూచించారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలతో సీఎం రేవంత్‌రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించిన సీఎం, ప్రజా పాలన-–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఐఏఎస్‌లంటే ఆషామాషీ కాదని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే అని అన్నారు. మిల్లర్ల వద్ద ఉన్న రూ.3,900 కోట్ల విలువైన ధాన్యాన్ని రికవరీ చేయాలని, మోసగిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌ను ఏమాత్రం ఉపేక్షించినా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్నామని, జూన్‌లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే అవార్డులు, రివార్డులు ఉంటాయన్నారు.
అవినీతిపరులపై కొరడా ఝుళిపించండి
ప్రభుత్వ వ్యవస్థలను పీడిస్తున్న అవినీతి, బోగస్ ఉద్యోగుల వ్యవహారంపై కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని 1.70 లక్షల ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు కూడా లేని బోగస్ ఉద్యోగులని ప్రభుత్వం గుర్తించింది. పదేండ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ దొంగ పేర్లతో జీతాలు స్వాహా చేసిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల బండారం బయటపెట్టేలా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి.
ప్రజాధనాన్ని ఈ తరహాలో దుర్వినియోగం చేసిన సదరు ఏజెన్సీల నిర్వాహకులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని ఆర్థిక శాఖకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న రూ.3,900 కోట్ల భారీ విలువైన బియ్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. బియ్యం దారిమళ్లింపు మోసాలకు పాల్పడే రైస్ మిల్లర్లను కలెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని అన్నారు. జున్‌లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని.. ఆలోగా పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించారు.
అభివృద్ధి ప్రణాళికలో అందరికీ భాగస్వామ్యం
99 రోజుల ప్రణాళిక ప్రతి కలెక్టర్ పనితీరుకు ప్రధాన కొలమానంగా నిలుస్తుందని, అధికారుల సర్వీస్ కెరీర్‌కు పునాది వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వారి విధులు, బాధ్యతలపై ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమాల్లో వారికి అవసరమైన అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్‌ను సైతం ముందస్తుగా అందజేయాలని సూచించారు. ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించుకోవాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో, అత్యంత ఘనంగా నిర్వహించేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనంలో రాజీ వద్దు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ లాంటి దుర్ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ముందస్తుగా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రోజూ పర్యవేక్షించేందుకు విధిగా ఒక అధికారికి బాధ్య తలు అప్పగించి, జవాబుదారీతనం తీసుకురావాలని సూచించారు.
బాధ్యతలు తీసుకున్న ఆ అధికారి తప్పనిసరిగా విద్యార్థులతోపాటే కూర్చుని ప్రతిరోజూ బడిలోనే మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం వారానికోసారి ఏదో ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేసి తీరాలని ఆదేశించారు. పిల్లలకు అందించే పాలు, అల్పాహారం, భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు ప్రతి నెలా సకాలంలో బిల్లులు చెల్లించేలా యంత్రాంగం చూడాలన్నారు. పాఠశాలలు, విద్యార్థుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా డీఈవోలతోపాటు సంబంధిత కలెక్టర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-–సిగరెట్ల వాడకం కనిపిస్తే, వాటిని అరికట్టాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.
లబ్ధిదారులకు ‘ఫేషియల్ రికగ్నిషన్’తో పారదర్శకత
సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత పాటించాలన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్లకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో నిర్వహించే సభల్లో లబ్ధిదారుల వివరాలను అందరి ముందు బహిరంగంగా చదివి వినిపించాలి. మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాల విశిష్టతను ప్రజలందరికీ వివరించాలి. 500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ తదితర పథకాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చును వెల్లడించాలి. అర్హులకు కచ్చితంగా ప్రభుత్వ లబ్ధి చేకూరాలి.
అదే సమయంలో అనర్హులు ఏమాత్రం ప్రయోజనం పొందకుండా పకడ్బందీగా అడ్డుకోవాలి. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ పథకానికి తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని సాంకేతికత ఆధారంగా అమలు చేయాలి. ఈ సాంకేతికతను వాడటం వల్లే ఆసరా పింఛన్లలో అక్రమంగా లబ్ధి పొందుతున్న 3 లక్షల మంది అనర్హులను ఏరివేయగలిగాం” అని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీతోపాటు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠినంగా పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాలు, మండలాల వారీగా క్రోడీకరించి ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
బడులు తెరిచే నాటికే పుస్తకాలు, యూనిఫామ్స్
వచ్చే విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్యను అందించడంతో పాటు బస్సులు, భోజన సదుపాయాలు అక్కడే సమకూరుస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పాఠశాల తరహాలో సకల సదుపాయాలు, సర్వ హంగులతో ఈ విద్యాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యేల సూచనలు పరిగణనలోకి తీసుకొని ఏ మండలంలో వీటిని ఏర్పాటు చేయాలో కలెక్టర్లు తక్షణమే స్థల నిర్ధారణ చేయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి వెంటనే పంపించాలని ఆదేశించారు. జూన్ 12న బడులు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందేలా విద్యాశాఖ అధికారులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చేందుకు అవసరమైన విప్లవాత్మక సంస్కరణలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి కార్పొరేట్ స్కూల్లో తప్పనిసరిగా ఒక సైకాలజిస్ట్ ఉండేలా విద్యా శాఖ అధికారులు చూడాలన్నారు. నగరాల్లోని మహిళలు, విద్యార్థుల వసతి గృహాలను నమోదు చేసి, ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఆయా యాజమాన్యాలకు అనుమతులు ఇవ్వాలన్నారు.
మెడికల్ కాలేజీల సేవలు సామాన్యుడికి దక్కాలి
ప్రజల వైద్య అవసరాల కోసం ప్రభుత్వం ఏటా సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ.2,500 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఇంత భారీగా ప్రజాధనం వెచ్చిస్తున్నప్పుడు పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అద్భుతమైన సేవలు దక్కాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ దవాఖానాల రూపు రేఖలు మార్చబోతున్నామని వెల్లడించారు. ‘‘భవిష్యత్తులో రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు రోగులను ప్రైవేటుకు కాకుండా నేరుగా ఈ ఆధునిక మెడికల్ కాలేజీలకే రిఫర్ చేసేలా పక్కా విధానం తీసుకురావాలి.
కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులను తరచూ సందర్శించి రోగుల సమస్యలు రాకముందే ముందస్తుగా తగిన నివారణ చర్యలు చేపట్టాలి” అని సీఎం సూచించారు. త్వరలోనే సనత్‌నగర్, అల్వాల్‌తోపాటు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్యుల సేవలను అడ్మినిస్ట్రేషన్ నుంచి వేరు చేసి, సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ఆర్థిక ఇన్సెంటివ్‌లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నిపుణులైన డాక్టర్ల సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించాలి..
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో పునరుత్పాదక ఇంధన వనరులపై, ముఖ్యంగా సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అధికారులు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు బదులుగా సోలార్ మోటార్లను వినియోగిస్తే రైతులకు కరెంటు బిల్లుల భారం ఎలా తప్పుతుందో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇండ్లపైన సౌర విద్యుత్ ప్యానెల్స్ అమర్చుకొని, దానిని గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఆ కుటుంబాలకు వచ్చే అదనపు ఆదాయాన్ని వివరించాలన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే చర్యలు చేపట్టాలన్నారు. భూసార పరీక్షలు సకాలంలో పూర్తి చేసి, ఏ నేలలో ఏ పంట బాగా పండుతుందో వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అన్నదాతలకు సూచించాలని చెప్పారు. నానో యూరియా వాడకం, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో లైవ్ ప్రదర్శనల ద్వారా రైతులకు కళ్లకు కట్టినట్లు చూపాలన్నారు.
యూరియా యాప్ వినియోగంలో రైతులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించి, దానిని సులువుగా వాడేలా తక్షణ మార్పులు చేయాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు విత్తన దళారుల వ్యవస్థను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, డీజీపీ తదితరులు పాల్గొని సమగ్రమైన కార్యాచరణపై చర్చించారు.
ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యల పరిష్కారం
దేశంలోనే ఐఏఎస్ సర్వీస్ అత్యున్నతమైనదని, కలెక్టర్‌గా పనిచేయడం ప్రతి అధికారికి లభించే ఒక అద్భుతమైన అవకాశం అని సీఎం రేవంత్ తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజుల పాటు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, సామాన్య ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయని, వాటికి పరిష్కారం లభిస్తుందన్నారు. నెలలో కనీసం ఐదు రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే ఆయా జిల్లాల్లో వారిని కలెక్టర్లుగా గౌరవప్రదంగా కొనసాగిస్తామని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా అధికారులే వ్యవహరించాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా మదింపు చేసి, తనకు కచ్చితమైన నివేదికను అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.
భవిష్యత్తు నగరాలకు వేగంగా అడుగులు
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), ఫ్యూచర్ సిటీ నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే.. మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించడంతోపాటు అందులో అక్రమాలు జరిగితే వెంటనే అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు ఉండేలా స్థలాల ఎంపిక, నిర్మాణ ప్రణాళికలు త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు.
రవాణా శాఖ పరిధిలో స్కూల్ బస్సులు, ఇతర వెహికల్స్‌కు ఫిట్నెస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి, డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై గుంతల ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ తేవాలని, ఓఆర్ఆర్ రోడ్ల వెంట వ్యర్థాలు వేసే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. యువతకు ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించాలని, ప్రభుత్వం చేపట్టిన 62,749 ఉద్యోగ నియామకాల స్ఫూర్తితో స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’ అమలులో ప్రతి కలెక్టర్ నూటికి నూరు శాతం భాగస్వామ్యం తీసుకోవాలని, మంచి చేస్తే ప్రభుత్వం తప్పక అభినందిస్తుందన్నారు.
