ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఎక్కడ మ్యాచ్ లు ఆడుతుందో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తొలగించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల పరిస్థితి చోటు చేసుకుంది. ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. మరోవైపు బీసీసీఐ ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్ లను శ్రీలంకకు తరలించడం కష్టంతో కూడుకున్నది అని చెబుతోంది. దీంతో ఐసీసీ ఈ నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
శనివారం (జనవరి 10) నాటికి బంగ్లాదేశ్ మ్యాచ్ లు ఎక్కడ ఆడుతుందనే ఐసీసీ తన తీర్పును వెలువరించాల్సి ఉన్నా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. పాకిస్తాన్ రంగంలోకి దిగి చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య.. పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ తమ వరల్డ్ కప్ మ్యాచ్ లను పాకిస్థాన్ లో ఆడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. బంగ్లాదేశ్ లో తమకు భద్రత లేదని భావిస్తే పాకిస్థాన్ లో ఆడుకోవచ్చని ఆ దేశ క్రికెట్ బోర్డు చెప్పినట్టు సమాచారం.
పాకిస్తాన్ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫైయర్‌తో సహా ప్రధాన ఐసీసీ ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహించిందని.. అందువల్ల బంగ్లాదేశ్ మ్యాచ్ లను కూడా సజావుగా నిర్వహించగల సామర్థ్యం ఉందని పాక్ బోర్డు వర్గాలు తెలిపాయట. మరి ఈ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
అసలేం జరిగిందంటే...?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కి ఇండియా, శ్రీలంక ఆతిధ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ తమ లీగ్ మ్యాచ్ లన్నీ ఇండియాలోనే ఆడాల్సి ఉంది. అయితే ఇండియా, బంగ్లాదేశ్ దేశాల ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియాలో వరల్డ్ కప్ ఆడడానికి నిరాకరించింది. భద్రత కారణాలు వంకగా చూపిస్తూ ఇండియా వచ్చి ఆడేది లేదని ఐసీసీకి స్పష్టం చేసింది. తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి వివరించింది. ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని కొట్టిపారేసినట్టు వార్తలు వస్తున్నాయి.
►ALSO READ | IND vs NZ: మిచెల్, నికోల్స్, కాన్వే హాఫ్ సెంచరీలు.. తొలి వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
