ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ పెట్రోల్ దొరకదు.. E–20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది.. అంటే ఏంటంటే..

ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ పెట్రోల్ దొరకదు.. E–20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది.. అంటే ఏంటంటే..

భారతదేశం ఒక పెద్దమార్పుకు సిద్ధమవుతోంది. ఇది  భారతదేశ  ఇంధన రంగాన్ని  ప్రభావితం చేసే మార్పు. 01 ఏప్రిల్ 2026 నుంచి భారతదేశ ఇంధన స్టేషన్లలో E–20  పెట్రోల్ మాతమే దొరుకుతుంది. ప్రస్తుతం వాడుతున్న సాధారణ పెట్రోల్ (100%పెట్రోలు) ఇకపై లభించదు.  E–20 పెట్రోల్  అంటే  20%  ఇథైల్ ఆల్కహాల్ + 80% పెట్రోల్  కలిసి ఉన్న ఒక బ్లెండెడ్ పెట్రోల్.  E-20 పెట్రోల్​కు కావలసినది ఇథైల్ ఆల్కహాల్. ఇది ఒక పునరుత్పాదక జీవ ఇంధనం. ఇథైల్ ఆల్కహాల్​ను ఆహార ధాన్యాలను  పులియపెట్టడం  ద్వారా  తయారు చేస్తారు.

మొక్కజొన్న తక్కువ నీటితో పండుతుంది,  విరివిగా లభిస్తుంది.  ఎక్కువ మొత్తంలో ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది.  కాబట్టి మొక్కజొన్న  నుంచి ఇథైల్ ఆల్కహాల్​ను ఎక్కువ మొత్తంలో లాభసాటిగా తయారు చేయవచ్చు.  ఇథైల్ ఆల్కహాల్​ను చెరుకు నుంచి కూడా తయారు చేస్తారు.  చెరుకుసాగు అధిక మొత్తంలో నీటిని వినియోగించుకోవడం వలన భూగర్భ జలాలు క్షీణిస్తాయి.  కాబట్టి  ఇథైల్ ఆల్కహాల్​ను ఇతర పదార్థాల నుంచి తయారుచేస్తున్నారు. 

దీనికి  కేంద్ర ప్రభుత్వం రెండు కారణాలను చెపుతోంది. మొదటిది.. డబ్బు ఆదా అవుతుంది.  భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద  పెట్రోలియం దిగుమతిదారుల్లో ఒకటి.  పెట్రోల్​కు  ఇథైల్ ఆల్కహాల్ కలిపితే  పెట్రోలియం దిగుమతి తగ్గుతుంది,  డబ్బు కూడా ఆదా అవుతుంది.  2014 నుంచి ఇథైల్ ఆల్కహాల్ బ్లెండింగ్ ద్వారా భారతదేశం $15.5 బిలియన్లు ఆదా చేసింది.  రెండో కారణం... ఉద్గారాల తగ్గింపు.  ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ కంటే 40% తక్కువ గ్రీన్​హౌస్​ గ్యాస్లను ఉత్పత్తి  చేస్తుంది. 

2014 నుంచి 70 మిలియన్ టన్నుల  కార్బన్  డైఆక్సైడ్  ఉద్గారాలను  తగ్గించడానికి ఇది సహాయపడింది. కాబట్టి ఖర్చు తగ్గించడం, కాలుష్యం తగ్గించడం  ఇవి  రెండూ  ప్రధాన కారణాలు. అదేవిధంగా  పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడటం వల్ల  ప్రస్తుతం  ఇతర దేశాలలో  జరుగుతున్న యుద్ధాలవంటివి  మన పెట్రోల్  దిగుమతులపై,  దేశ ఆర్థికవ్యవస్థపై  తీవ్రమైన ప్రభావాన్ని  చూపుతాయి.

20 శాతం ఇథైల్ ఆల్కహాల్ కలిపిన E-20 పెట్రోల్
మొదట 2014లో  పెట్రోలులో 1.5%  ఇథైల్  ఆల్కహాల్ బ్లెండింగ్ ఉండేది.  ఆ తర్వాత E–10 పెట్రోలును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  అంటే 10%  ఇథైల్ ఆల్కహాల్ + 90% పెట్రోల్  కలిసిఉన్న ఇంధనం.  E–10 పెట్రోలును  సరఫరా చేయాలనే లక్ష్యాన్ని  కేంద్రప్రభుత్వం అనుకున్నదానికంటే ఐదు నెలలు ముందుగానే అంటే జూన్ 2022లో  చేరుకుంది. ఈ విజయంతో 20 శాతం ఇథైల్ ఆల్కహాల్ కలిపిన E–20 పెట్రోల్ భారతదేశం  అంతటా సరఫరా చేయాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం  నిర్దేశించుకుంది.

భారతదేశం E-–20 పెట్రోల్ టార్గెట్ కూడా ముందుగానే 2025లో  సాధించింది (నిర్దేశించుకున్న లక్ష్యం 2030  కంటే 5 సంవత్సరాలముందు).  జులై 2025లో  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి  అధికారికంగా  ఈ విషయాన్ని తెలియజేశారు. కేంద్రప్రభుత్వం E–20 ఇంధనానికి సరిపడేల  వాహనాల  తయారీకి,  అమ్మకానికి  2023లోనే  ఆదేశం ఇచ్చింది. కాబట్టి 2023 తర్వాత  తయారైన  చాలా వాహనాలు (కార్లు, బైక్​లు) E–20 ఇంధనానికి సరిపోతాయి, అనుకూలంగా ఉంటాయి.

2023కు ముందు తయారైన వాహనాల పరిస్థితి ?
భారతదేశంలో పెట్రోల్ వాహనాల  అధికారిక జీవితకాలం15  సంవత్సరాలు. కానీ,  E–20  వాహనాల  అమ్మకానికి 2023లో  కేంద్రప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. 2011 నుంచి 2023 వరకు 250 మిలియన్లకు పైగా  వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 234 మిలియన్లు పెట్రోల్ వాహనాలు. 

అంటే ఈ వాహనాల్లో ఏవీ E–20 ఇంధనానికి సిద్ధంగా లేవు. ఈ  234 మిలియన్ వాహనాలు రిస్కులో ఉన్నాయి. వాటికి మైలేజీ 3 నుంచి 7%  తగ్గుతుంది. వాహనంలోని కొన్ని రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు వేగంగా అరిగిపోవడం, చిరిగిపోవడం వంటివి జరగవచ్చును. అంతేకాకుండా ఇతర ఇంజిన్ భాగాలు దెబ్బతినవచ్చు.

ఈ డ్యామేజ్కు ఎవరు బాధ్యత వహిస్తారు ? 

E– 20  పెట్రోలుకు అనుకూలంగా లేని పాత వాహనాలలో  E–20 పెట్రోల్  వాడడంవలన జరిగే  నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు,  ప్రభుత్వం బాధ్యత  వహించదు.  ఈ  విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే స్పష్టంగా చెప్పాయి.  గత  ఏడాది కస్టమర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించి  E–20 పెట్రోల్ అమలును  కొన్ని రోజులుపాటు ఆపమని  కోరారు.  కానీ,  సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇది అతి పెద్ద సమస్య.  E–20  ఇంధనం  మినిమమ్ 95 రీసెర్చ్ ఆక్టేన్  నెంబర్ (95 RON) కలిగి ఉండాలని  ప్రభుత్వం  తెలియజేసింది.  రీసెర్చ్  ఆక్టేన్  నెంబర్,  సాధారణంగా వాడే ఆక్టేన్ నెంబర్  రెండూ ఒక్కటే.

పెట్రోల్​నాణ్యతను తెలియజేసే ‘RON’
Research Octane Number (RON) అనేది  పెట్రోలు  నాణ్యతను  తెలియజేస్తుంది.  ఎక్కువ  RO N  నెంబర్ ఉంటే అది నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ఇది వాహన సామర్థ్యాన్ని,  పనితీరును  పెంచుతుంది. పెట్రోల్ RON తక్కువ ఉన్నట్లయితే   అది  నాణ్యతలేని పెట్రోల్.   అది ‘నాకింగ్’ కు  దారి తీస్తుంది.  అంటే  వాహనం పెద్దపెద్ద శబ్దాలు చేయడం వలన వాహన సామర్థ్యం,  పనితీరు దెబ్బతింటాయి. RONను  ‘ఐసో-ఆక్టేన్’,  ‘n-హెప్టేన్’ అనే రెండు  హైడ్రో కార్బన్లు కలిపిన మిశమంతో  పోల్చడం ద్వారా  తెలుసుకుంటారు. 

స్వచ్ఛమైన  ఐసో- ఆక్టేన్ యొక్క RON = 100 (అంటే ఇది అధికనాణ్యతగలది),  స్వచ్ఛమైన n-హెప్టేన్.. RON = 0 (అంటే ఇది అసలు నాణ్యత లేనిది). ఉదాహరణకు RON 95 ఉన్న పెట్రోల్ 95% ఐసో-ఆక్టేన్,  5% n-హెప్టేన్  మిశ్రమంలా  పనిచేస్తుం ది.   అంటే ఇది అధిక నాణ్యత గలది. RON 45 ఉన్న  పెట్రోల్ 45%  ఐసో-ఆక్టేన్,  55% n-హెప్టేన్  మిశ్రమంలా  ప్రవర్తిస్తుంది.  అంటే ఇది అసలు  నాణ్యత లేనిది.  ‘సెటేన్ సంఖ్య’  డీజిల్ ఇంధన నాణ్యతను తెలియజేస్తుంది. 

భారత్లో E-20తో  RON 95 ఎందుకు ముఖ్యం ?
భారతదేశంలో  సాధారణ  పెట్రోలులో 91RON గా  ఉంటుంది. ఏప్రిల్ 1,  2026  నుంచి  అమ్మనున్న E–20  పెట్రోలులో  కనీసం 95 RON కలిగి ఉండాలని ప్రభుత్వం  ఆదేశించింది.  స్వచ్ఛమైన  ఇథైల్  ఆల్కహాల్ చాలా ఎక్కువ  RON  రేటింగ్ (~108–110 RON)  కలిగి ఉంటుంది. 20%  ఇథైల్  ఆల్కహాల్ కలపడం  వలన  సాధారణంగా  పెట్రోలుతో  పోలిస్తే RON 5–6 పాయింట్లు  పెరుగుతుంది. 

మోడర్న్​ ఇంజిన్లకు  (2023 తర్వాత వచ్చినవి)  బెటర్  పనితీరు ఉంటుంది.  అందుకే  E–20 పెట్రోలుకు   కనీసం 95 RON  కలిగి ఉండాలని  ప్రభుత్వం  ఆదేశించింది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న  సమాచారం  ప్రకారం E20పెట్రోల్​కు  వేరే ధర లేదు.  ఏప్రిల్ 1, 2026  నుంచి E–20 పెట్రోల్  సాధారణ పెట్రోల్ ధరతోనే  అమ్ముతారు. ఉప్పల్ కలాన్ (హైదరాబాద్ ప్రాంతం)లో  ప్రస్తుతం  లీటరుకు  107.46  రూపాయలు  ఉన్నది.  ఏప్రిల్ 1 నాటికి కూడా (క్రూడ్ ఆయిల్ ధరలు మారకపోతే) సుమారు  లీటరుకు 107–108 రూపాయలు మధ్యే ఉండవచ్చు.

ధరలు ఎందుకు తగ్గడం లేదు ?
ఇథైల్ ఆల్కహాల్ క్రూడ్ ఆయిల్ కంటే  చౌకగా  దొరుకుతుంది.  కానీ,  పెట్రోల్ పంప్ ధరలో  సెంట్రల్​ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్​, డీలర్  కమీషన్  వంటివి  ఎక్కువగా ఉంటాయి.  ఇవి  పూర్తిగా  తగ్గించలేదు.  బ్రెజిల్,  అమెరికా, యూరప్  వంటి  మార్కెట్లు  ఇప్పటికే  ఇథైల్  ఆల్కహాల్  బ్లెండెడ్ పెట్రోలును ఉపయోగిస్తున్నాయి. 

E–20 పెట్రోలు వలన ఎనర్జీ సెక్యూరిటీ,  విదేశీమారక  ద్రవ్యాన్ని ఆదా చేయటం,  గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం మొదలగు అనేక ఆర్థిక,  పర్యావరణ ఉపయోగాలు ఉన్నాయి. కనుక దేశ  ప్రజలందరూ ఈ మార్పును  స్వాగతించాలి.  అదేవిధంగా  2023కు ముందు కొన్న వాహనాలకు ప్రభుత్వం  పరిష్కారం చూపాలి.  

డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.