అన్ని వర్గాలు కలిసికట్టుగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుంటే కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదనడం అతిశయోక్తి కాదు.
ప్రజల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇచ్చిన మాటపై నిలబడి, రాజకీయ ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితులను లెక్కచేయకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మొక్కవోని దీక్షతో రాష్ట్ర ఏర్పాటుకు కీలక నిర్ణయాలు తీసుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయాయి. 2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం పన్నెండేళ్లు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి , చేపడుతున్న సంక్షేమం ప్రజల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పాత్రను విస్మరించడం అసాధ్యం. 2004లో కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ మొదలుకొని 2009 డిసెంబర్ ప్రకటన వరకు జరిగిన పలు పరిణామాలు రాష్ట్ర ఆవిర్భావానికి బాటలు వేసాయి. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా లెక్కచేయకుండా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో రాజకీయ అవరోధాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ వెనుకడుగు వేయకపోవడం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని విషయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగులు, కళాకారులు, రైతులు, మేధావులతో పాటు సబ్బండ వర్గాలు ఆశించిన స్థాయిలో బీఆర్‌ఎస్ పాలన లేకపోవడంతో 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ రాజ్యం’ లక్ష్యంతో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తూ ప్రజాదరణ పొందుతోంది.
290 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు
తెలంగాణ ఆవిర్భావ సమయానికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ అప్పుల మయంగా మార్చినా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ ముందుకు సాగుతోంది. మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో రోజుకు సగటున 40 లక్షలకుపైగా మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటివరకు వారు 290 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేయడంతో ఆ కుటుంబ ఖర్చులపై గణనీయమైన ఆర్థికభారం తగ్గింది. మహిళల పేరిట 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభిస్తోంది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పేదలకు మెరుగైన వైద్య భద్రత లభిస్తోంది. మహిళా సంఘాలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, వడ్డీ రహిత రుణాల పంపిణీ ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం
ప్రాధాన్యం ఇస్తోంది.
ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా
ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రంలో పేదల సొంతింటి కలలను నిజం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు 3.24 లక్షలకుపైగా ఇళ్లను మంజూరు చేయగా కొన్ని ప్రారంభమయ్యాయి. మరొకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు ప్రోత్సాహకంతో పథకం అమలవుతోంది. రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా’ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 1.5 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనుంది. రైతన్నల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. రైతులకు రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేయడంతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఊరట పొందాయి. రైతు భరోసా కింద ఎకరానికి ఏటా రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తుండగా, రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం అందుతోంది. సన్న బియ్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రాష్ట్రంలో వరిసాగు పెరిగింది.
ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం
ప్రభుత్వ ప్రోత్సాహకాలతో తెలంగాణ రికార్డు స్థాయిలో 275 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు మారుపేరైన ధరణి స్థానంలో తీసుకొచ్చిన ‘భూ భారతి’ ప్రజల్లో భరోసా నింపింది. అవినీతికి అడ్డుకట్ట వేసి భూ యజమానులకు న్యాయంచేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో నిరుద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వం భారీగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహంతో తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తుండటం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోంది. ‘ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోంది.
విశ్వనగరం హైదరాబాద్
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కొత్త కారిడార్లు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, నగర శివారు ప్రాంతాలకు మెట్రో విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రోతోపాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహకారం ఆశిస్తోంది. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
‘అభయ హస్తం’ పాలనతో కొత్త ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలుగా మారాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునేలా కుట్రలు చేయడం దురదృష్టకరం. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ సహకరించకుండా వివక్ష చూపుతోంది. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రజలు మొదటి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరాశ చెందగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ‘అభయ హస్తం’ పాలనతో కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ‘ఇందిరమ్మ రాజ్యం’ ద్వారా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కలగలిపిన పరిపాలన అందిస్తోందనే భావన ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోంది. ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యంతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషితో ప్రత్యేక రాష్ట్ర కలలు సాకారమవుతున్నాయనే తృప్తి ప్రజల్లో కలుగుతోంది.
బి. మహేష్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
