ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? TGPSC నుంచి మూడు కొత్త నోటిఫికేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? TGPSC నుంచి మూడు కొత్త నోటిఫికేషన్లు

హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు కొత్త నోటిఫికేషన్లను జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ నుంచి రెండు నోటిఫికేషన్లు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

49 ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు TGPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ  వేగం పెంచిన సంగతి తెలిసిందే. 

ఈ జూన్ నెలలోనే 5 నుంచి 6 జాబ్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు TGPSC కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం ఇప్పటికే వెల్లడించారు. మంగళవారం 3 నోటిఫికేషన్లు  ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వాటిని దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, ఏఎస్‌‌‌‌‌‌‌‌ఓ తదితర పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

దేవాదాయశాఖలో పోస్టుల భర్తీకి కొంత సమయం పడుతుందని తెలిపారు. త్వరలో రాబోయే నోటిఫికేషన్లలో అత్యధికంగా 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉండనున్నాయని  చెప్పారు. సుమారు 20, 25 రకాల ఒకటీ, రెండు పోస్టులను కలిపి గ్రూప్ నోటిఫికేషన్లుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోమని, కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.