చింతపిక్కలతో తాగునీటిలో మైక్రోప్లాస్టిక్ మాయం.. భారత టీనేజర్ల అద్భుత పరిశోధన

చింతపిక్కలతో తాగునీటిలో మైక్రోప్లాస్టిక్ మాయం.. భారత టీనేజర్ల అద్భుత పరిశోధన
  • చింతపిక్కల పొడితో.. మైక్రోప్లాస్టిక్‌‌‌‌కు చెక్!
  • తక్కువ ఖర్చుతో వినూత్న ఆవిష్కరణ
  • ముగ్గురు భారతీయ విద్యార్థులకు ‘ఎర్త్ ప్రైజ్-2026’

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థుల మేధస్సుకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ముగ్గురు టీనేజర్స్​ చింతపిక్కల పొడితో నీటిలోని ప్రమాదకర మైక్రోప్లాస్టిక్ కణాలను వేరు చేసే వినూత్న సాంకేతికతను కనుగొన్నారు. రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన వివాన్ ఛావ్ఛరియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ‘ప్లాస్ స్టిక్’ అని పేరు పెట్టారు. 

ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పర్యావరణ పోటీ ‘ది ఎర్త్ ప్రైజ్–2026’కి పంపి, ఆసియా రీజనల్ విజేతలుగా నిలిచారు. ఏకంగా 12,500 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 10 లక్షలకు పైగా) నగదు బహుమతిని అందుకున్నారు. 

సులువైన పరిష్కారం.. 

ప్రపంచవ్యాప్తంగా తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్   విపరీతంగా చేరుతున్నాయి. అది మానవ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ సమస్యకు చింతపిక్కలతో అత్యంత సులువైన పరిష్కారాన్ని కనుగొన్నారు ఈ టీనేజర్స్‌‌‌‌. వ్యవసాయ వ్యర్థాలుగా మిగిలిపోయే చింతపిక్కలను ప్రాసెస్ చేసి, ఒక ప్రత్యేకమైన పౌడర్‌‌‌‌ను తయారుచేశారు. ఈ పౌడర్‌‌‌‌ను నీటిలో వేయగానే అది మైక్రోప్లాస్టిక్ కణాలను ఆకర్షించి, వాటిని ఒకదగ్గరికి చేర్చి గడ్డకట్టేలా చేస్తుంది. చింతపిక్కల పొడిలో ముందే ఇనుప ధాతువులను చేర్చుతారు. కాబట్టి ఆ గడ్డలను అయస్కాంతం సాయంతో నీటి నుంచి సులభంగా వేరు చేయవచ్చు. 

స్వచ్ఛమైన నీటిని అందించాలని

గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు ఈ యువ ఆవిష్కర్తలు తెలిపారు. ప్రాజెక్టును మరింత మెరుగుపరచడానికి ఐఐటీ గువాహటికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తల సాయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 8,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇది ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. కాగా, 2026 చివరి నాటికి కనీసం 35,000 నుంచి 40,000 మంది విద్యార్థులకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ముగ్గురు పనిచేస్తున్నారు.