తెలంగాణకు వర్షసూచన! ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు  వర్షసూచన!  ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు
  • ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్​
  • రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్, వెలుగు: ఇన్ని రోజులు ఎండలతో సతమతమైన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రీమాన్సూన్​ షవర్స్​(వర్షాకాలానికి ముందు వచ్చే వానలు) కురుస్తాయని వెల్లడించింది. బుధవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని తెలిపింది. రెండు రోజులు ఆరెంజ్​అలర్ట్, ఆ తర్వాత నాలుగు రోజులకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. బుధవారానికిగానూ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. 

గురువారానికిగానూ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసిన జిల్లాల్లో ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్లో అలర్ట్​ ఇచ్చిన జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, ఆ తర్వాత నాలుగు రోజులకూ ఎల్లో అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే చాన్స్​ ఉందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. హైదరాబాద్​ సిటీలోనూ మోస్తరు వర్షం, గంటకు 50 కిలోమీటర్లతో గాలులు వీచే చాన్స్​ ఉందని పేర్కొంది. 

నైరుతి యాక్టివ్..

నైరుతి రుతుపవనాల్లో కొంచెం వేగం పెరిగింది. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు చురుగ్గా మారాయి. ఇప్పటికే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళ తీరం సమీపానికి వచ్చాయి. దీంతో గురువారం నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి మరో ఐదారు రోజుల్లో మన రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే చాన్స్​ ఉనట్టు అధికారులు చెబుతున్నారు. 

ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గనున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్​ కన్నా తక్కువకు దిగువకు దిగొచ్చాయి. కేవలం రెండు జిల్లాల్లోనే 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఐదు జిల్లాల్లో 43 డిగ్రీలు, 21 జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలు, ఐదు జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలొస్తే టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్​ సిటీలోనూ టెంపరేచర్లు కొంత తగ్గాయి. అత్యధికంగా ముషీరాబాద్​ సర్కిల్​లో 41.7 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. అంబర్​పేట, గోషామహల్​లలో 41.6 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది.