ఒకటికి 2 సార్లు చెక్ చేశాకే ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత 6 కోట్ల పెట్టుబడి మటాష్

ఒకటికి 2 సార్లు చెక్ చేశాకే ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత 6 కోట్ల పెట్టుబడి మటాష్

ఒక్క క్లిక్‌తో కోట్ల రూపాయల లాభం.. కళ్లముందే కంప్యూటర్ స్క్రీన్‌పై రాకెట్‌లా దూసుకుపోతున్న ప్రాఫిట్ గ్రాఫ్ ఇంకేముంది.. లైఫ్ సెట్ అయిపోయిందని సంబరపడేలోపే జీవితకాల సంపాదనంతా గాల్లో కలిసిపోయింది. బెంగళూరులో బయటపడ్డ ఈ మైండ్ బ్లోయింగ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఎంత పక్కా స్కెచ్ వేస్తారో.. నమ్మకం కుదిరినట్టే నటించి ఎలా నిలువునా ముంచుతారో చెప్పడానికి ఇది లైవ్ ప్రూఫ్. 50 ఏళ్ల వ్యక్తి ఎలా రూ.6 కోట్లు నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ వల్ల పోగొట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన బాధితుడికి ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా భారీగా సంపాదించాలనే ఆశ పుట్టింది. స్నేహితుల ద్వారా ‘పియూ ప్రైమ్’ అనే ప్లాట్‌ఫామ్ గురించి తెలుసుకున్నప్పటికీ, ట్రేడింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడంతో గూగుల్, ఫేస్‌బుక్‌లలో గైడెన్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతనికి శిల్పా శివకుమార్ అనే మహిళ పరిచయమైంది. తమ ట్రేడింగ్ లాభాల్లో కొంత వాటా ఇచ్చేలా వారిద్దరి మధ్య ఒక డీల్ కుదిరింది. భారతీయ ఇన్వెస్టర్ల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన అద్భుతమైన ట్రేడింగ్ యాప్ అంటూ ఒక నకిలీ ప్లాట్‌ఫామ్‌ను ఆమె అతనికి పరిచయం చేసింది. అది నిజమైనదేనని నమ్మి అతను రిజిస్టర్ చేసుకున్నాడు.

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అతను పెట్టిన పెట్టుబడులకు స్క్రీన్‌పై భారీగా లాభాలు కనిపిస్తుండటంతో ఆ ట్రేడర్ ఆనందానికి అవధులు లేవు. పైగా నమ్మకం కుదరడం కోసం కేటుగాళ్లు మొదట్లో చిన్న మొత్తంలో డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి కూడా అనుమతించారు. అయినా సరే ఇంకాస్త పక్కాగా చెక్ చేద్దామని ఆ ట్రేడర్ ఎవరికీ చెప్పకుండా అదే ప్లాట్‌ఫామ్‌లో రెండో అకౌంట్ ఓపెన్ చేసి టెస్ట్ చేశాడు. అందులో కూడా విపరీతమైన లాభాలు చూపించడంతో నూటికి నూరు శాతం జెన్యూన్ యాప్ అని నమ్మేశాడు. ఆ స్క్రీన్‌పై కనిపిస్తున్న లాభాలన్నీ ఫేక్ అని.. తమను ముంచడానికి కేటుగాళ్లు డిజిటల్ స్క్రీన్‌ను మేనేజ్ చేస్తున్నారనే నిజాన్ని అతను గ్రహించలేకపోయాడు.

ఇక అకౌంట్‌లో లాభాలు కొండలా పేరుకుపోతుండటం, అటువైపు నుంచి నిర్వాహకులు మరింత పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేయడంతో.. అతను తన బ్యాంక్ అకౌంట్లతో పాటు, తన భార్య అకౌంట్ల నుంచి డబ్బు విడతల వారీగా రూ.5కోట్ల 95లక్షల వరకూ ఆ నకిలీ ప్లాట్‌ఫామ్‌కు ట్రాన్స్ ఫర్ చేసేశాడు. ఒకానొక దశలో అతని అకౌంట్ బోర్డుపై ఏకంగా రూ.50 కోట్ల ప్రాఫిట్ చూపెట్టింది. ఇక చాలు అనుకుని.. ఆ లాభాలను విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సినిమా మొదలైంది. 

ALSO READ : దలాల్ స్ట్రీట్ కుదేల్: భారత స్టాక్ మార్కెట్‌ను దాటేసిన తైవాన్, సౌత్ కొరియా

తన ట్రేడింగ్ అకౌంట్ కు యాక్సెస్ దొరక్కపోవడం, సాంకేతిక ఇబ్బందులు అంటూ కేటుగాళ్లు డ్రామాలు ఆడటంతో తాను దారుణంగా మోసపోయానని ఆ ట్రేడర్‌కు అర్థమైంది. కళ్లముందు కోట్లు కనిపిస్తున్నా, చేతికి చిల్లిగవ్వ కూడా రాని పరిస్థితి ఎదురవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ భారీ స్కామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల వెనుక ఉండే ఇటువంటి మాయా ప్రపంచాన్ని నమ్మి మోసపోవద్దని నిపుణులు ఎంత హెచ్చరిస్తున్నా మాయగాళ్ల వలలో పడి చివరికి జీవితకాలం సంపాదించిన డబ్బును కోల్పోతున్న బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.