దలాల్ స్ట్రీట్ కుదేల్: భారత స్టాక్ మార్కెట్‌ను దాటేసిన తైవాన్, సౌత్ కొరియా

దలాల్ స్ట్రీట్ కుదేల్: భారత స్టాక్ మార్కెట్‌ను దాటేసిన తైవాన్, సౌత్ కొరియా

గ్లోబల్ స్టాక్ మార్కెట్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ మార్కెట్ విలువ ర్యాంకింగ్స్‌లో భారత షేర్ మార్కెట్ 7వ స్థానానికి పడిపోయింది. గత వారం తైవాన్ భారత్‌ను వెనక్కి నెట్టగా.. తాజాగా సౌత్ కొరియా కూడా భారత్‌ను అధిగమించింది. జస్ట్ రెండు వారాల్లోనే రెండు ఆసియా దేశాలు భారత స్టాక్ మార్కెట్ల విలువను దాటుకుపోవడం గమనార్హం. జూన్ 1 నాటికి సౌత్ కొరియా మార్కెట్ విలువ 5.04 ట్రిలియన్ డాలర్లకు చేరి 6వ స్థానాన్ని కైవసం చేసుకోగా, తైవాన్ 5.15 ట్రిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 4.84 ట్రిలియన్ డాలర్లతో 7వ స్థానానికి పరిమితమైంది.

ఆసియా మార్కెట్లలో కనిపిస్తున్న ఈ భారీ మార్పులకు AI, సెమీకండక్టర్ రంగాలు ప్రధాన కారణం. 2026లో సౌత్ కొరియాకు చెందిన కోస్పి సూచీ ఏకంగా 110 శాతం కంటే ఎక్కువ లాభపడగా, తైవాన్ మార్కెట్ 65 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మార్కెట్లుగా ఇవి నిలిచాయి. AI డేటా సెంటర్లకు అవసరమైన సెమీకండక్టర్లు, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీని తయారు చేసే TSMC, శామ్‌సంగ్, SK హైనిక్స్ లాంటి కంపెనీలు భారీ లాభాలను ఆర్జించడమే దీనికి కారణం. ఈ రెండు దేశాల మొత్తం మార్కెట్ విలువలో 60 శాతం వాటా ఈ రంగాలదే కావడం గమనార్హం. 

ప్రస్తుతం భారత మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. 2026లో సెన్సెక్స్ 12 శాతం, నిఫ్టీ 15 శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్ విలువలు మితిమీరిపోవడం, కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను నిరంతరం వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు 2024 సెప్టెంబర్ నుంచి భారత మార్కెట్లను కుంగదీస్తున్నాయి. దీనికి తోడు భారత మార్కెట్లలో AI ఆధారిత కంపెనీలు లేకపోవడం కూడా ఒక పెద్ద లోటుగా మారింది.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారత్‌కు ప్రతికూలంగా మారాయి. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి. ఇది భారతదేశ ద్రవ్యోల్బణాన్ని, వాణిజ్య లోటును పెంచుతోంది. అలాగే దేశంలో ఈ ఏడాది 90 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ అంచనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్యోల్బణాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేలా ఉన్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగానే భారత స్టాక్ మార్కెట్లు రియాక్ట్ కావటం కూడా మార్కెట్ విలువను ప్రభావితం చేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల భారతీయ కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుందని క్రిసిల్, అంబిట్ క్యాపిటల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సవాళ్లను అధిగమించి భారత మార్కెట్లు ఎప్పుడు పుంజుకుంటాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.